ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మే 4వ తేదీన అధికారిక సందర్శనలో భాగంగా కొద్దిసేపు పారిస్‌లో ఆగిన నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్యాన్యుయెల్‌ మేక్రాన్‌ ఆయనకు ఆతిథ్యమిచ్చారు.

2. భారత-ఫ్రాన్స్‌ దేశాలు 1998 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై విశ్వాసం, అంతర్జాతీయ చట్టంపై అచంచల నిబద్ధత, సుస్థిర-లోతైన పరస్పర నమ్మకంతో కూడిన దృఢమైన పునాదిపై ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అలాగే బహుళ ధ్రువ; చక్కదిద్దబడిన, ప్రభావశీల బహుపాక్షికతలపై విశ్వాసం దీనికి ప్రాతిపదికగా ఉంది. అంతేకాకుండా రెండు దేశాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, ప్రాథమిక స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలు, నియమబద్ధ పాలన, మానవ హక్కులపై గౌరవం మెండుగా కలిగి ఉన్నాయి.

3. మహమ్మారి అనంతరం ప్రపంచమంతా భౌగోళిక-రాజకీయ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భవిష్యత్‌ పరిణామాలపై తమ ఉమ్మడి నిబద్ధతను భారత్‌-ఫ్రాన్స్‌ పునరుద్ఘాటించాయి. కొత్త సవాళ్లను ఎదుర్కొనడంలో తమ మధ్య విస్తృత సహకారంతోపాటు ఇతర రంగాలకూ దాన్ని విస్తరించడం ద్వారా అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత విస్తరింపజేసుకోవాలని నిర్ణయించాయి.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతం

4. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలను పెంపొందించడం లక్ష్యంగా భారత్‌, ఫ్రాన్స్ ఓ కీలక వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరచుకున్నాయి. ఆ మేరకు అంతర్జాతీయ చట్టం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలకు గౌరవంతోపాటు ప్రయాణ స్వేచ్ఛగల.. బల ప్రయోగం, ఉద్రిక్తతలు, సంఘర్షణలు లేని.. స్వేచ్ఛాయుత, బహిరంగ, నియమాధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతంపై తమ దృక్పథాన్ని పంచుకుంటాయి.

5. భారత్‌-ఫ్రాన్స్.. భారత్‌-పసిఫిక్ భాగస్వామ్యంలో రక్షణ-భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, అనుసంధానం, ఆరోగ్యం, స్థిరత్వం అంతర్భాగాలుగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ద్వైపాక్షిక సహకారంసహా భావసారూప్యంగల వివిధ దేశాలు, ప్రాంతీయ సంస్థలతో వివిధ రూపాల్లో కొత్త భాగస్వామ్యాలను ఏర్పచుకోవడాన్ని రెండు దేశాలూ కొనసాగిస్తాయి. ఐరోపా దేశాల మండలికి ఫ్రాన్స్‌ అధ్యక్షత వహిస్తున్నపుడు 2022 ఫిబ్రవరిలో జరిగిన తొలి ఇండో-పసిఫిక్ సచివుల స్థాయి వేదిక ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సహకారంపై ఐరోపా సమాఖ్య వ్యూహం ఆధారంగా సమాఖ్య స్థాయిలో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

6. భారత-ఐరోపా సమాఖ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై తమ నిబద్ధతను భారత్‌, ఫ్రాన్స్‌ పునరుద్ఘాటించాయి. అలాగే భారత్‌—యూ అనుసంధాన భాగస్వామ్యం అమలులో మరింత సన్నిహితంగా కృషి చేయడానికి అంగీకరించాయి. దీంతోపాటు 2021 మే నెలలో పోర్టోలో జరిగిన భారత-ఇయూ నేతల సమావేశం తీసుకున్న నిర్ణయాల అమలులోనూ సంయుక్త కృషికి సంసిద్ధత తెలిపాయి. ఇటీవల భారత-ఇయూ వాణిజ్య-సాంకేతిక మండలి ఏర్పడటంపై ఉభయదేశాలూ హర్షం వ్యక్తం చేశాయి. వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, భద్రతసహా వాణిజ్యం, పెట్టుబడులు, భౌగోళిక సూచీలకు సంబంధించి  భారత-ఇయూ మధ్య ఒప్పందాలపై చర్చల పునరుద్ధరణకు సంబంధించిన వ్యూహాత్మక అంశాలపై ఉన్నతస్థాయి సమన్వయానికి ఈ మండలి తోడ్పడుతుంది.

ఉక్రెయిన్‌

7. రష్యా దళాలు ఎలాంటి కవ్వింపు లేకుండా, చట్టవిరుద్ధఃగా ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫ్రాన్స్ పునరుద్ఘాటించింది.

8. ఉక్రెయిన్‌లో ప్రస్తుత సంఘర్షణ, మానవతా సంక్షోభంపై భారత్‌-ఫ్రాన్స్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌లో పౌరుల మృతిని రెండు దేశాలూ ముక్తకంఠంతో ఖండించాయి. ఈ మేరకు ప్రజల బాధలకు తక్షణ ముగింపు దిశగా చర్చలు, దౌత్య ప్రయత్నాలకు వీలుగా ఉభయ పక్షాలూ వెంటనే దాడులు నిలిపివేయాలని సూచించాయి. లనూ ఒక వేదికపైకి చేర్చడంలో శత్రుత్వాలను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశాలు, అంతర్జాతీయ చట్టం, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాల్సిన అవసరాన్ని భారత్‌-ఫ్రాన్స్‌ నొక్కిచెప్పాయి. ఉక్రెయిన్‌లో సంఘర్షణకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇద్దరు నేతలూ చర్చించిన సందర్భంగా ఈ అంశంపై సమన్వయాన్ని ముమ్మరం చేసేందుకు అంగీకరించారు.

9. కోవిడ్-19 మహమ్మారి ఫలితంగా ప్రస్తుతం ప్రపంచ ఆహార భద్రతతోపాటు ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో పోషకాహార లోపం పెరిగిపోవడంపై భారత్‌-ఫ్రాన్స్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే ఉక్రెయిన్‌లో సంఘర్షణ కారణంగా తలెత్తిన ఆహార సంక్షోభం ముప్పు నివారణపై సమన్వయంతో కూడిన  బహుపాక్షిక ప్రతిస్పందన దిశగా ప్రయత్నాలు ప్రారంభించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చక్కగా పనిచేసే మార్కెట్లు, సంఘీభావం, దీర్ఘకాలిక ప్రతిరోధకతలు లక్ష్యంగాగల ఆహార-వ్యవసాయ ప్రతిరోధక కార్యక్రమం (ఫార్మ్‌)సహా వివిధ చర్యలు చేపట్టేందుకు సంసిద్ధత తెలిపారు.

10. ఆఫ్ఘనిస్తాన్‌లో మానవతా సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘనపై భార‌త్‌-ఫ్రాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేర‌కు శాంతియుత, సురక్షిత, సుస్థిర‌ ఆఫ్ఘనిస్తాన్‌కు బలమైన మద్దతును పునరుద్ఘాటించాయి. అదే స‌మ‌యంలో దాని సార్వభౌమత్వం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతల‌ను గౌర‌విస్తూ దాని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమ‌ని నొక్కిచెప్పాయి. అక్క‌డ సార్వ‌జ‌నీన‌, ప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్ప‌డ‌టంతోపాటు మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులకు గౌర‌వం ల‌భించాల‌ని వారు పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఐక్య‌రాజ్య స‌మితి తీర్మానం 2593 (2021)ని పునరుద్ఘాటించారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యాప్తికి ఆఫ్ఘన్ భూభాగం ఉపయోగించడాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించ‌రాద‌ని నొక్కిచెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఐరాస భద్రత‌ మండలి వేదిక‌స‌హా ఎక్క‌డైనా స‌మ‌ష్టిగా కృషి చేసేందుకు వారిద్ద‌రూ అంగీకరించారు.

వ్యూహాత్మక సహకారం

11. ర‌క్ష‌ణ‌కు సంబంధించిన అన్ని అంశాల్లో ముమ్మ‌ర సహకారంపై ఉభ‌య పక్షాలూ హ‌ర్షం ప్ర‌క‌టించాయి. ఉమ్మడి (శక్తి, వరుణ, పెగాస్, డెజ‌ర్ట్ నైట్, గరుడ) సైనిక క‌స‌ర‌త్తులు అవ‌కాశం ఉన్న సంద‌ర్భాల్లో మెరుగైన ఏకీకరణ, పరస్పర కార్యాచ‌ర‌ణ దిశ‌గా ప్రయత్నాలకు సంకేతాలుగా నిలుస్తాయ‌ని దేశాధినేత‌లిద్ద‌రూ  పేర్కొన్నారు. కాగా, భారత్‌-ఫ్రాన్స్ మధ్య సముద్ర సహకారం ప‌ర‌స్ప‌ర‌ విశ్వాసంరీత్యా కొత్త శిఖ‌రాల‌కు చేరింది. త‌ద‌నుగుణంగా  హిందూ మహాసముద్రం అంతటా క‌స‌ర‌త్తులు, ఆదాన‌ప్ర‌దానాలు, సంయుక్త కృషి ఈ స‌హ‌కారం కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు.

12. భారత్‌-ఫ్రాన్స్ మధ్యగల దీర్ఘకాలిక ఆయుధ సహకారం పరస్పర విశ్వాసానికి నిదర్శనమని ఉభయపక్షాలూ నొక్కిచెప్పాయి. ముంబయిలోని ‘ఎండీఎల్‌’లో నిర్మించిన ఆరు స్కార్పీన్‌ జలాంతర్గాములు “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమానికి అనుగుణంగా ఫ్రాన్స్ నుంచి భారత్‌కు సాంకేతిక పరిజ్ఞాన బదిలీ స్థాయిని వివరిస్తాయి. మహమ్మారి పరిస్థితులున్నప్పటికీ రాఫెల్‌ యుద్ధ విమానాలను సకాలంలో అందజేసిన నేపథ్యంలో రక్షణ రంగానికి సంబంధించి రెండు పక్షాల మధ్య సమన్వయం సుస్పష్టమవుతోంది. ఈ ఊపును కొనసాగిస్తూ పరస్పర విశ్వాసం ప్రాతిపదికన ‘స్వయం సమృద్ధ భారతం’ దిశగా కృషిలో ఫ్రాన్స్‌ భాగస్వామ్యం మరింత సృజనాత్మకంగా విస్తరించే మార్గాన్వేషణకు ఉభయపక్షాలూ అంగీకరించాయి. తదనుగుణంగా పరిశ్రమల మధ్య భాగస్వామ్యాల మెరుగును ప్రోత్సహించడంసహా అత్యాధునిక రక్షణ సాంకేతికత, తయారీ, ఎగుమతులలో సహకరించుకోవాలని తీర్మానించాయి.

13. రెండు దేశాల మధ్య అంతరిక్ష విజ్ఞాన-సాంకేతిక సహకారం 60 ఏళ్లకుపైగా సంప్రదాయకంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల అంతరిక్షం పరంగా తలెత్తుతున్న సమకాలీన సవాళ్లను పరిష్కరించాలని ఉభయదేశాలూ నిర్ణయించాయి. ముఖ్యంగా అన్నదేశాలకూ సురక్షిత అంతరిక్షం అందుబాటులో ఉండాలనే సూత్రం మేరకు సంబంధిత అంశాలపై ద్వైపాక్షిక వ్యూహాత్మక చర్చలకు భారత్‌-ఫ్రాన్స్‌ అంగీకరించాయి. అంతరిక్ష, రక్షణ, పాలన రంగాల నిపుణులను ఈ చర్చలు ఒకే వేదికపైకి చేరుస్తాయి. దీంతోపాటు అంతరిక్షంలో  భద్రత, ఆర్థిక సవాళ్లపై చర్చలకు ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. అంతరిక్షానికి వర్తించే నియమాలు, సూత్రావళిసహా సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను ఈ చర్చలు ఆవిష్కరిస్తాయి. ఈ మేరకు తొలివిడత చర్చలను ఈ ఏడాదిలోనే వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అంగీకరించాయి.

14. డిజిటలీకరణ ప్రపంచవ్యాప్తం అవుతున్న నేపథ్యంలో రెండు దేశాల సైబర్‌ భద్రత సంస్థల మధ్య సహకారాన్ని భారత్‌-ఫ్రాన్స్ బలోపేతం చేసుకున్నాయి. సమన్వయ దృక్పథం ప్రాతిపదికన సైబర్ ముప్పులను ఎదుర్కొనడానికి సైబర్ నిబంధనలు, సూత్రాలను ప్రోత్సహించడంలో చేయి కలపడానికి అంగీకరించాయి. తదనుగుణంగా శాంతియుత, సురక్షిత,  సార్వత్రిక సైబర్‌ ప్రపంచానికి సహకరించే లక్ష్యంతో ద్వైపాక్షిక సైబర్ చర్చల ఉన్నతీకరణకు అంగీకరించాయి.

15. రెండు దేశాల్లోని అంకుర పర్యావరణ వ్యవస్థల అనుసంధానానికి ఉభయపక్షాలూ అనేక చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సంయుక్త కృషికి ఇటీవల ప్రభుత్వ-ప్రైవేటు రంగాలు సిద్ధం కావడాన్ని స్వాగతించాయి. అవి సాధించిన విజయాలతోపాటు స్వేచ్ఛాయుత, సార్వజనీన, ఆవిష్కరణాత్మక, సార్వత్రిక డిజిటల్‌ మౌలిక సదుపాయాల దిశగా ప్రమాణాలు, పద్ధతుల రూపకల్పనకు సంయుక్తంగా కృషి చేయడంపై హర్షం వ్యక్తం చేశాయి. దీంతోపాటు జనజీవన పరివర్తన సహా ప్రపంచ విశాలహితం దిశగా పరిష్కారాలను అన్వేషించాలని ఆకాంక్షించాయి. కాగా, ఐరోపాలో అత్యంత భారీ డిజిటల్‌ ప్రదర్శన ‘వివాటెక్‌’ ఈ ఏడాది పారిస్‌లో జరగనున్న నేపథ్యంలో భారత్‌ తొలి దేశంగా నమోదైంది.

16. సైబర్‌ భద్రత, డిజిటల్‌ సాంకేతికతలపై భారత-ఫ్రాన్స్‌ మార్గ ప్రణాళిక అమలులో భాగంగా భారతదేశంలో సూపర్‌ కంప్యూటర్ల తయారీసహా ‘సి-డాక్‌-అటోస్‌’ మధ్య విజయవంతమైన సహకారాన్ని ఎగ్జాస్కేల్‌ సాంకేతికత దిశగా విస్తరించేందుకు భారత్‌-ఫ్రాన్స్‌ తమ సంసిద్ధతను పునరుద్ఘాటించాయి. దీంతోపాటు మరింత సురక్షిత సార్వభౌత్వ 5జి/6జి టెలికాం వ్యవస్థల దిశగా కలిసి కృషి చేయడానికి కూడా ఉభయ పక్షాలూ అంగీకరించాయి.

17. విశ్వసనీయ, సరసమైన, తక్కువ కర్బన ఉద్గారతగల విద్యుత్తు కోసం వ్యూహాత్మక  జైతాపూర్‌ ‘ఈపీఆర్‌’ ప్రాజెక్టును విజయవంతం చేయడంపై రెండు పక్షాలూ తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఈ దిశగా కొన్ని నెలలనుంచీ సాధించిన ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం సంప్రదింపులు పెంచాలని నిర్ణయించాయి.

18. భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంలో.. ముఖ్యంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో  ఉగ్రవాద నిరోధంపై సహకారం ఒక పునాదిరాయి. ఉగ్రవాదం ముసుగు, సీమాంతర ఉగ్రవాదంసహా అన్నిరూపాల్లోని ఉగ్రవాదాన్ని రెండు దేశాలూ బలంగా ఖండించాయి. ఉగ్రవాదానికి ఆర్థిక అండదండలు, ఉగ్రవాద దుర్బోధ, హింసాత్మక తీవ్రవాదం, ఉగ్రవాద-హింసాత్మక దుశ్చర్యల కోసం ఇంటర్నెట్‌ దుర్వినియోగం, అంతర్జాతీయంగా ప్రకటితమైన ఉగ్రవాదులు, సంస్థలపై చర్యలుసహా అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటాన్ని కొనసాగించడంలో తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. ఇందులో భాగంగా “ఉగ్రవాదానికి నిధులు అందరాదు” పేరిట 2022లో భారత్‌ నిర్వహించే మూడో అంతర్జాతీయ సదస్సుపై  చురుగ్గా సమన్వయం చేసుకునేందుకు రెండుపక్షాలూ అంగీకరించాయి.

వాతావరణం.. పరిశుభ్ర ఇంధనం.. సుస్థిర ప్రగతి

19. పారిస్ ఒప్పందానికి ఆమోదంతోపాటు అంతర్జాతీయ సౌర కూటమిని ఉమ్మడిగా ప్రారంభించిన ఏడేళ్ల తర్వాత వాతావరణ మార్పుల ప్రభావం తగ్గింపు, అనుసరణ రీత్యా సంబంధిత సమస్యల పరిష్కారంపై భారత్‌-ఫ్రాన్స్‌ల నిబద్ధత గతంకన్నా మరింత బలపడింది. ఈ దిశగా పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి ఒక ప్రధాన పరిష్కారం. తదనుగుణంగా అంతర్జాతీయ సౌర కూటమి లక్ష్యాలకు రెండు దేశాలూ తమ మద్దతును పునరుద్ఘాటించాయి. సముచిత ఇంధన పరివర్తన మార్గాలకుగల అవకాశాలపై సంయుక్త కృషికి భారత్‌, ఫ్రాన్స్‌ అంగీకరించాయి. జి7 కూటమి పునరుత్పాదక వనరుల వినియోగం పెంచడంసహా సుస్థిర ఇంధన లభ్యతను వేగిరపరచడం కూడా ఇందులో భాగంగా ఉంటాయి. పరిశుభ్ర ఇంధనం దిశగా నిబద్ధతలో మరొక అడుగు ముందుకేస్తూ తమ జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌ కింద భారతదేశాన్ని హరిత ఉదజని కూడలిగా రూపుదిద్దడంలో పాలుపంచుకోవాలని ఫ్రాన్స్‌ను భారత్‌ ఆహ్వానించింది. ఉదజనిపై నియంత్రణ, ధ్రువీకరణ, ప్రామాణీకరణ అంశాలు సహా కర్బనరహిత ఉదజనిపై సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఉభయపక్షాలూ ఆసక్తితో ఉన్నాయి. ఈ మేరకు శక్తిమంతమైన పారిశ్రామిక భాగస్వామ్యాల ఏర్పాటుపై సహకారం దిశగా మార్గ ప్రణాళికను త్వరలో ఖరారు చేసేందుకు అంగీకరించాయి. అలాగే సమీకృత సరఫరా ప్రక్రియ ద్వారా ఆసియా, ఐరోపా మార్కెట్లకు సౌరశక్తి సరఫరా కోసం తమ సొంత సౌర విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు పారిశ్రామిక భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడంపై సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించాయి.

20. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిర ఆర్థిక సహాయానికి మద్దతు పెంచడానికి ‘ఏఎఫ్‌డీ', భారత ఎగ్జిమ్‌ బ్యాంకు చేసిన కృషిపై భారత్‌, ఫ్రాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ విషయంలో తమ సహకారాన్ని ముమ్మరం చేసేందుకు అంగీకరించాయి. రక్షిత ప్రదేశాలు, సహజ ఉద్యానాల అభివృద్ధి ద్వారా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సుస్థిర విధానాలను ప్రోత్సహించే ఉమ్మడి లక్ష్యాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదించిన “ఇండో-పసిఫిక్ పార్కుల భాగస్వామ్యం” ఒడంబడిక స్పష్టం చేస్తోంది.

21. ప్లాస్టిక్‌ పూర్తి జీవితకాలం సమస్యసహా ప్లాస్టిక్‌ కాలుష్యం నివారణపై చట్టబద్ధ అంతర్జాతీయ ఒప్పందం ఉండాలన్న నిర్ణయంతోపాటు ఈ దిశగా ‘యూఎన్‌ఈఏ’ పురోగతి సాధించింది. ప్లాస్టిక్‌ కాలుష్యంపై పోరాడాలన్న ఉమ్మడి లక్ష్యంపై భారత్‌, ఫ్రాన్స్‌ పట్టుదలకు ఇది కీలక సంకేతం. ఆ మేరకు ప్లాస్టిక్‌ కాలుష్యం అంతం దిశగా బలమైన, ప్రతిష్టాత్మక చట్టబద్ధ పత్రం ఆమోదం దిశగా కృషికి రెండు దేశాలూ తమ ప్రోత్సాహాన్ని కొనసాగిస్తాయి. అదే సమయంలో ఈ సమస్య నిర్మూలనపై చర్యలు తీసుకోవడంలో ఆయా దేశాల జాతీయ పరిస్థితులు, సూత్రాలను, సామర్థ్యాన్ని గౌరవిస్తాయి. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తక్షణ, నిరంతర ప్రాతిపదికన పరిష్కరించడానికి ప్రపంచ దేశాలు తక్షణ సామూహిక స్వచ్ఛంద చర్యలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఉభయపక్షాలు పిలుపునిచ్చాయి.

22. భారతదేశంలో సుస్థిర పట్టణాభివృద్ధి, జీవ వైవిధ్యం, ఇంధన పరివర్తన ఇతర వాతావరణ సంబంధిత ప్రాజెక్టులపై భారత నిబద్ధతకు ‘ఏఎఫ్‌డీ’ గ్రూపు, ఇతర సంస్థల ద్వారా ఫ్రాన్స్‌ అందిస్తున్న సహకారంపై రెండు దేశాలూ హర్షం వ్యక్తంచేశాయి.

23. నీలి ఆర్థిక వ్యవస్థ, మహాసముద్ర పరిపాలన అంశాలపై ద్వైపాక్షిక మార్గ ప్రణాళికను ఆమోదించడంతోపాటు అమలును వేగిరపరచడంపై భారత్‌, ఫ్రాన్స్‌ సంతృప్తి ప్రకటించాయి.

24. మహా సముద్రాల పరిరక్షణకు కీలకమైన జాతీయ అధికార పరిధికి ఆవలి ప్రాంతాల సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణ, సుస్థిర  ఉపయోగంపై ‘అంక్లాస్‌’ కింద అంతర్జాతీయ చట్టబద్ధ పత్రంపై అంతర ప్రభుత్వ తీర్మానం పురోగతికి సంయుక్తంగా మద్దతిస్తామని భారత్‌, ఫ్రాన్స్ ప్రకటించాయి.

25. జి20 చట్రంలో బలమైన సమన్వయం కొనసాగించేందుకు ఉభయ పక్షాలూ  అంగీకరించాయి. మరోవైపు ఐరాస భద్రత మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంసహా అణు సరఫరాదారుల కూటమిలో సభ్యత్వంపై భారత్‌ ప్రయత్నాలకు ఫ్రాన్స్ స్థిరంగా మద్దతిస్తామని ఫ్రాన్స్‌ పునరుద్ఘాటించింది.

26. వలసలు, ప్రయాణాలపై 2021 అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన భాగస్వామ్య ఒప్పందం అమలుకు భారత్‌, ఫ్రాన్స్ పూర్తి నిబద్ధత ప్రకటించాయి.

27. విద్యార్థులు, పట్టభద్రులు, నిపుణులు, నైపుణ్యంగల కార్మికుల రాకపోకలను పెంచడానికి ఉభయపక్షాలు సంయుక్తంగా కృషి చేస్తాయి. అయితే, అక్రమ వలసలను అరికట్టేదిశగా తమ చర్యలను బలోపేతం చేస్తాయి. ద్వైపాక్షికంగా విద్యార్థుల రాకపోకల ప్రయోజనాన్ని గుర్తిస్తూ 2025 నాటికి 20,000 మంది భారత విద్యార్థులకు అవకాశం కల్పించే లక్ష్యాన్ని ఫ్రాన్స్‌ కొనసాగిస్తుంది. తద్వారా రెండు దేశాల మధ్య కొత్త వ్యాపారాలు, అంకుర సంస్థలు, ఆవిష్కరణలకు ఇది అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

28. కళలు-సంస్కృతిపై పరస్పర ఆసక్తి గణనీయంగా పెరగడంతోపాటు పండుగలు, నివాసాల వంటి ప్రాజెక్టుల విషయంలో సహకారానికి మన రెండు దేశాల కళాకారులు మరింత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవం 2022 మార్చి నుంచి ‘బోంజోర్ ఇండియా ఫెస్టివల్’ ద్వారా దేశమంతటా వరుస కార్యక్రమాలతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తన వంతుగా ‘నమస్తే ఫ్రాన్స్’ వేడుకను నిర్వహిస్తోంది. మరోవైపు ‘పారిస్ పుస్తక ప్రదర్శన-2022’లో భారత్‌ గౌరవ అతిథిగా ఉంది. అలాగే న్యూ ఢిల్లీలో తదుపరి ‘ప్రపంచ పుస్తక ప్రదర్శన’ సందర్భంగా ఫ్రాన్స్ గౌరవ అతిథిగా ఉంటుంది.

29. ప్రదర్శనశాలలు-సంస్కృతిపై సహకారానికి సంబంధించి 2020 జనవరి 28న ఆసక్తి వ్యక్తీకరణ లేఖపై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో ఢిల్లీలో కొత్త జాతీయ ప్రదర్శనశాల ఏర్పాటుపై ఫ్రాన్స్ “విజ్ఞాన భాగస్వామి”గా ఉండే అవకాశాలు, యంత్రాంగం ఏర్పాటుపై భారత్‌, ఫ్రాన్స్ మార్గాన్వేషణ చేస్తాయి.

30. తన పర్యటన సందర్భంగా తమ మధ్య చర్చకొచ్చిన రంగాల్లో సహకారంపై సమగ్ర చర్చలతోపాటు గుర్తించిన లక్ష్యాల సాధన సంబంధిత విధివిధానాల ఖరారు కోసం వీలు చూసుకుని భారత పర్యటనకు రావాల్సిందిగా అధ్యక్షుడు మేక్రాన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government