ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆయనతోపాటు డెన్మార్క్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులు- మెట్టీ ఫ్రెడరిక్సన్, కాట్రిన్ జాకబడోట్టిర్, జోనాస్ గార్‌స్టోర్, మగ్దలీనా ఆండర్సన్, సనామారిన్ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.
ఈ రెండో సదస్సులో భాగంగా 2018లో తొలి భారత-నార్డిక్ శిఖరాగ్ర సదస్సును స్టాక్‌హోమ్‌లో నిర్వహించిన నాటినుంచి భారత-నార్డిక్ సంబంధాల్లో ప్రగతిని సమీక్షించుకునే అవకాశం లభించింది. మహమ్మారి అనంతర ఆర్థిక పునరుద్ధరణ, వాతావరణ మార్పు, సుస్థిర ప్రగతి, ఆవిష్కరణలు, డిజిటలీకరణ, హరిత-పరిశుభ్ర వృద్ధిలో బహుపాక్షిక సహకారంపై సదస్సు చర్చించింది.
సుస్థిర సముద్ర నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారిస్తూ సముద్ర రంగంలో సహకారంపైనా సభ్యదేశాల అధినేతలు చర్చించారు. నీలి ఆర్థిక వ్యవస్థ రంగంలో… ముఖ్యంగా భారతదేశం చేపట్టిన ‘సాగరమాల’ పథకంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రధానమంత్రి నార్డిక్ కంపెనీలను ఆహ్వానించారు.
ఆర్కిటిక్ ప్రాదేశికంలోని నార్డిక్ ప్రాంతంతో భారత్ భాగస్వామ్యంపై అధినేతలు చర్చించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో భారత-నార్డిక్ సహకార విస్తరణకు భారత ఆర్కిటిక్ విధానం చక్కని చట్రం కాగలదని ప్రధానమంత్రి గుర్తుచేశారు.
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా నార్డిక్ దేశాల సామాజిక సంపద నిధి ప్రాధికార సంస్థలను ప్రధానమంత్రి ఆహ్వానించారు.
అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా సదస్సులో చర్చలు సాగాయి.
శిఖరాగ్ర సదస్సు అనంతరం ఆమోదించిన సంయుక్త ప్రకటనను ఇక్కడ చూడవచ్చు.