QuoteCrossing the milestone of 140 crore vaccine doses is every Indian’s achievement: PM
QuoteWith self-awareness & self-discipline, we can guard ourselves from new corona variant: PM Modi
QuoteMann Ki Baat: PM Modi pays tribute to Gen Bipin Rawat, his wife, Gp. Capt. Varun Singh & others who lost their lives in helicopter crash
QuoteBooks not only impart knowledge but also enhance personality: PM Modi
QuoteWorld’s interest to know about Indian culture is growing: PM Modi
QuoteEveryone has an important role towards ‘Swachhata’, says PM Modi
QuoteThink big, dream big & work hard to make them come true: PM Modi

       నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం! ఈ సమయంలో మీరు 2021కి వీడ్కోలు చెప్తూ 2022కి స్వాగతం పలకడానికి సిద్ధమవుతూ ఉంటారు. ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ వచ్చే ఏడాదిలో  రాబోయే సంవత్సరంలో మరింత మెరుగ్గా మారాలని, ఏదైనా మంచి చేయాలని సంకల్పం తీసుకోవడం జరుగుతుంది. గత ఏడు సంవత్సరాలుగా మన 'మన్ కీ బాత్' కూడా వ్యక్తి, సమాజం, దేశం  మంచితనాన్ని ఎత్తిచూపుతోంది. మంచి చేయడానికి , మంచిగా మారడానికి స్ఫూర్తినిస్తోంది.  ఈ ఏడేళ్లలో 'మన్ కీ బాత్' చేస్తున్నప్పుడు ప్రభుత్వం సాధించిన విజయాల గురించి కూడా చర్చించగలిగాను. మీరు దీన్ని ఇష్టపడ్డారు. మెచ్చుకున్నారు. కానీ మీడియాకు దూరంగా, వార్తాపత్రికల ఆకర్షణలకు దూరంగా చాలా మంది మంచి చేస్తున్నారనేది దశాబ్దాల అనుభవం. దేశ భవిష్యత్తు కోసం తమ నేటి కాలాన్ని వెచ్చిస్తున్నారు. వారు దేశంలోని రాబోయే తరాల కోసం తమ ప్రయత్నాలతో తీరిక లేకుండా ఉన్నారు. అలాంటి వ్యక్తుల చర్చ చాలా ఓదార్పునిస్తుంది. లోతైన స్ఫూర్తిని ఇస్తుంది. నా విషయంలో 'మన్ కీ బాత్' ఎప్పుడూ అలాంటి వారి కృషితో నిండిన అందమైన ఉద్యానవనం. 'మన్ కీ బాత్'లో ప్రతి నెలా నా ప్రయత్నం ఈ విషయంపైనే. ఆ తోటలోని ఏ పుష్పాదళాన్ని మీకోసం తీసుకురావాలా అని నేను ఆలోచిస్తాను.  బహురత్న వసుంధరగా పేర్కొనే భారతదేశ పుణ్యకార్యాల ఎడతెగని ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నందుకు సంతోషిస్తున్నాను.  దేశం అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఈ మానవశక్తి, ప్రజల శక్తి, ఆ శక్తి ప్రస్తావన, ప్రజల కృషి, భారతదేశ ప్రజలతో పాటు సమస్త మానవాళి  ఉజ్వల భవిష్యత్తు కోసం హామీ ఇస్తుంది.

       మిత్రులారా! ఇది జనశక్తిలోని బలం. భారతదేశం వందేళ్లలో వచ్చిన అతిపెద్ద అంటువ్యాధితో పోరాడగలగడం అందరి కృషి ఫలితం. ప్రతి కష్ట సమయంలో ఒక కుటుంబంలా ఒకరికొకరం అండగా నిలిచాం. మీ ప్రాంతంలో లేదా నగరంలో ఎవరికైనా సహాయం చేయడానికి సాధ్యమయ్యేదానికంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నించారు. ఈ రోజు ప్రపంచంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన గణాంకాలను భారతదేశంతో పోల్చి చూస్తే  దేశం అపూర్వమైన పని చేసినట్లు అనిపిస్తుంది. ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించిందా అనిపిస్తుంది. 140 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ల మైలురాయిని దాటడం ప్రతి భారతీయుడి ఘనత. ఇది వ్యవస్థపై ప్రజల నమ్మకానికి నిదర్శనంగా ఉంటుంది. సైన్స్‌పై నమ్మకాన్ని చూపుతుంది. శాస్త్రవేత్తలపై నమ్మకాన్ని చూపుతుంది. సమాజం పట్ల మన బాధ్యతలను నెరవేర్చడంలో భారతీయులమైన మన సంకల్ప శక్తికి నిదర్శనం. అయితే మిత్రులారా!  ఈ మహమ్మారిని ఓడించడానికి పౌరులుగా మన స్వంత ప్రయత్నం చాలా ముఖ్యమని గత రెండేళ్లుగా మన అనుభవం చెప్తోంది. మన శాస్త్రవేత్తలు ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌ను నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. వారికి ప్రతిరోజూ కొత్త విషయాలను సేకరిస్తున్నారు. ఆ సూచనలపై పని చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో కరోనా  ఈ వైవిధ్యానికి వ్యతిరేకంగా అప్రమత్తత, స్వీయ క్రమశిక్షణ దేశానికి గొప్ప శక్తి. మన సంఘటిత శక్తి కరోనాను ఓడిస్తుంది.  ఈ బాధ్యతతో మనం 2022లోకి ప్రవేశించాలి.

నా ప్రియమైన దేశప్రజలారా! మహాభారత యుద్ధ సమయంలో 'నభః స్పృశం దీప్తం' అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే గర్వంతో ఆకాశాన్ని తాకడం. భారతీయ వాయుసేన ఆదర్శ వాక్యం కూడా ఇదే. తల్లి భారతి సేవలో నిమగ్నమైన అనేక మంది జీవితాలు ప్రతిరోజూ గర్వంగా ఈ ఆకాశపు ఎత్తులను తాకుతున్నాయి. అవి మనకు చాలా నేర్పుతాయి. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ జీవితం అలాంటిదే. తమిళనాడులో ఈ నెల ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో వరుణ్ సింగ్ ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రమాదంలో దేశ  మొదటి సి.డి.ఎస్.  జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్యతో సహా అనేక మంది ధైర్యవంతులను కోల్పోయాము. వరుణ్ సింగ్ కూడా మృత్యువుతో చాలా రోజులు ధైర్యంగా పోరాడారు.  కానీ ఆయన కూడా మనల్ని వదిలి వెళ్లిపోయారు. వరుణ్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నా మనసుకు హత్తుకునే విషయం చూశాను. ఈ ఏడాది ఆగస్టులో ఆయనకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. ఈ సన్మానం తరువాత ఆయన తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఒక లేఖ రాశారు. ఈ ఉత్తరం చదివాక నా మదిలో మెదిలిన మొదటి ఆలోచన ఏమిటంటే విజయ శిఖరాలను అధిరోహించినా  ఆయన తన మూలాలను మరిచిపోలేదు. రెండవది – ఆయన తన విజయోత్సవాలను జరుపుకోవడానికి సమయం ఉన్నప్పుడు రాబోయే తరాల కోసం ఆలోచించారు. తాను చదివిన పాఠశాల విద్యార్థుల జీవితం కూడా వేడుకగా మారాలన్నారు. తన లేఖలో వరుణ్ సింగ్ తన పరాక్రమాన్ని వివరించలేదు కానీ తన వైఫల్యాల గురించి చెప్పారు. తన లోపాలను ఎలా సామర్థ్యాలుగా మార్చుకున్నారో చెప్పారు. ఈ లేఖలో ఒక చోట ఆయన ఇలా రాశారు- “సాధారణ మనిషిగా ఉండటం మంచిది. ప్రతి ఒక్కరూ పాఠశాలలో రాణించలేరు.  ప్రతి ఒక్కరూ 90లు సాధించలేరు. మీరు సాధిస్తే అది అద్భుతమైన విజయం. తప్పక మెచ్చుకోవాలి. అయితే మీరు అలా సాధించకపోతే మీరు సాధారణ స్థాయిలో ఉన్నారని అనుకోకండి. మీరు పాఠశాలలో సాధారణంగా ఉండవచ్చు కానీ జీవితంలో రాబోయే విషయాలకు ఇది కొలమానం కాదు. మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని కనుగొనండి. అది కళ, సంగీతం, గ్రాఫిక్ డిజైన్, సాహిత్యం మొదలైనవి కావచ్చు. మీరు ఏ పనిచేసినా, అంకితభావంతో చేయండి. మీ వంతు కృషి చేయండి. మరింతగా కృషి చేయవలసిందని ఆలోచిస్తూ ఎప్పుడూ పడుకోవద్దు.”

       మిత్రులారా! సాధారణ స్థాయి నుండి అసాధారణంగా మారడానికి ఆయన ఇచ్చిన మంత్రం కూడా అంతే ముఖ్యమైనది. ఈ లేఖలో వరుణ్ సింగ్ ఇలా రాశారు. "నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో దానిలో మీరు మంచిగా ఉండలేరని ఎప్పుడూ అనుకోకండి. ఇది సులభంగా రాదు. ఇది సమయం తీసుకుంటుంది. సౌకర్యాలను త్యాగం చేస్తుంది. నేను సామాన్యుడిని. ఈ రోజు నా కెరీర్‌లో కష్ట సాధ్యమైన మైలురాళ్లను చేరుకున్నాను. 12వ తరగతి మార్కులు మీరు జీవిత లక్ష్యాలను నిర్ణయిస్తాయని అనుకోకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. దాని కోసం పని చేయండి."

వరుణ్ తాను ఒక్క విద్యార్థిని ప్రేరేపించగలిగినా అది చాలా ఎక్కువ అని రాశారు. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను – ఆయన యావద్దేశానికి స్ఫూర్తినిచ్చారు. తన లేఖ ద్వారా కేవలం విద్యార్థులతో మాత్రమే మాట్లాడినప్పటికీ ఆయన మన మొత్తం సమాజానికి సందేశం ఇచ్చారు.

మిత్రులారా! ప్రతి సంవత్సరం నేను పరీక్షలపై విద్యార్థులతో ఇలాంటి అంశాలపై చర్చిస్తాను. ఈ సంవత్సరం కూడా పరీక్షలకు ముందు విద్యార్థులతో చర్చించాలని ప్రనాలీక రూపొందిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ కూడా రెండు రోజుల తర్వాత డిసెంబర్ 28వ తేదీ నుండి మై  గవ్  డాట్ ఇన్ లో ప్రారంభం అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 28 నుండి జనవరి 20 వరకు కొనసాగుతుంది. ఇందుకోసం 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఆన్‌లైన్‌ పోటీలను కూడా నిర్వహిస్తారు. మీరందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని కలిసే అవకాశం లభిస్తుంది. మనం కలిసి పరీక్ష, కెరీర్, విజయం, విద్యార్థి జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చిద్దాం.

నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్'లో ఇప్పుడు నేను మీకు చాలా దూరం నుండి, సరిహద్దులు దాటి వచ్చిన విషయాన్ని చెప్పబోతున్నాను. ఇది మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది కూడా:

గాత్రం #(వందే మాతరం)

వందేమాతరం.. వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ శీతలాం

సస్య శ్యామలాం మాతరం.. వందేమాతరం

శుభ్ర జ్యోత్స్నపులకితయామినీం

ఫుల్ల కుసుమిత ద్రుమదల శోభినీం

సుహాసినీం సుమధుర భాషిణీం

సుఖదాం  వరదాం మాతరం.

వందేమాతరం... వందేమాతరం.

మీరు దీన్ని విని ఆనందించారని, గర్వంగా భావించారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వందేమాతరంలో ఉన్న స్ఫూర్తి మనలో గర్వాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది.

మిత్రులారా!  ఈ అందమైన వీడియో ఎక్కడిది, ఏ దేశం నుండి వచ్చింది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. సమాధానం మీ ఆశ్చర్యాన్ని మరింత పెంచుతుంది. వందేమాతరం అందించిన ఈ విద్యార్థులు గ్రీస్‌కు చెందినవారు. అక్కడ వారు  ఇలియా లోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వారు ఎంతో అందంగా, భావోద్వేగంతో 'వందేమాతరం' పాడిన తీరు అద్భుతం, ప్రశంసనీయం. ఇటువంటి ప్రయత్నాలు రెండు దేశాల ప్రజలను మరింత సన్నిహితం చేస్తాయి. నేను ఈ గ్రీస్ విద్యార్థులను, వారి ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను. స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా వారు  చేసిన ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా! నేను లక్నో నివాసి నీలేష్ గారి పోస్ట్ గురించి కూడా చర్చించాలనుకుంటున్నాను. నీలేష్ గారు లక్నోలో ఒక ప్రత్యేకమైన డ్రోన్ ప్రదర్శనను ప్రశంసించారు. ఈ డ్రోన్ షోను లక్నోలోని రెసిడెన్సీ ప్రాంతంలో నిర్వహించారు. 1857 నాటి మొదటి స్వాతంత్ర్య పోరాట సాక్ష్యం ఇప్పటికీ రెసిడెన్సీ గోడలపై కనిపిస్తుంది. రెసిడెన్సీలో జరిగిన డ్రోన్ షోలో భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన వేర్వేరు అంశాలకు జీవం పోశారు. చౌరీ చౌరా ఆందోళన కావచ్చు. కాకోరి రైలు సంఘటన కావచ్చు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్   అసమానమైన ధైర్యం, పరాక్రమం కావచ్చు. వీటన్నిటినీ ప్రదర్శించిన ఈ డ్రోన్ షో అందరి హృదయాలను గెలుచుకుంది. అదేవిధంగా మీరు మీ నగరాలు, గ్రామాలలో  స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన ప్రత్యేక అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. ఇందులో సాంకేతికత సహాయం కూడా పొందవచ్చు. స్వాతంత్ర్య అమృతోత్సవ పండుగ స్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకునే  అవకాశాన్ని ఇస్తుంది. దాన్ని అనుభవించే అవకాశాన్ని ఇస్తుంది. దేశం కోసం కొత్త తీర్మానాలు చేయడానికి, ఏదైనా చేయాలనే సంకల్పాన్ని ప్రదర్శించడానికి ఇది ప్రేరణాత్మక ఉత్సవం, ప్రేరణాత్మక సందర్భం. స్వాతంత్య్ర సమరంలోని మహనీయుల స్ఫూర్తిని పొందుతూ దేశం కోసం మన ప్రయత్నాలను బలోపేతం చేస్తూనే ఉంటాం.

నా ప్రియమైన దేశప్రజలారా! మన భారతదేశం చాలా అసాధారణమైన ప్రతిభలతో సుసంపన్నమైంది. ఆ ప్రతిభా మూర్తుల సృజనాత్మకత ఇతరులను ఏదైనా చేయడానికి ప్రేరేపిస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల  విఠలాచార్య గారు ఒకరు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. మీ కలలను నెరవేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదనేందుకు విఠలాచార్య గారు ఒక  ఉదాహరణ. మిత్రులారా! పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే కోరిక విఠలాచార్య గారికి చిన్నప్పటి నుండి ఉండేది. దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. కాలక్రమేణా  విఠలాచార్య గారు అధ్యాపకుడయ్యారు. తెలుగు భాషను లోతుగా అధ్యయనం చేశారు. అందులో అనేక సృజనాత్మక రచనలు చేశారు. 6-7 సంవత్సరాల క్రితం ఆయన తన కలను నెరవేర్చుకోవడం మొదలుపెట్టారు. తన సొంత పుస్తకాలతో లైబ్రరీని ప్రారంభించారు. తన జీవితకాల సంపాదనను ఇందులో పెట్టారు. క్రమంగా ప్రజలు అందులో చేరడం, సహకరించడం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఈ గ్రంథాలయంలో దాదాపు 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. చదువుతో మొదలుకొని అనేక విషయాల్లో తాను పడిన ఇబ్బందులు మరెవరికీ రాకూడదని విఠలాచార్య గారు అంటారు. ఈరోజు అధిక సంఖ్యలో విద్యార్థులు దాని ప్రయోజనాలను పొందడం చూసి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన కృషితో స్ఫూర్తి పొంది అనేక ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

మిత్రులారా! పుస్తకాలు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాయి. జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠన అభిరుచి అద్భుతమైన సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం చాలా పుస్తకాలు చదివానని గర్వంగా చెప్పుకునే వారిని ఈ రోజుల్లో చూస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పుస్తకాలను మరిన్ని చదవాలనుకుంటున్నాను. ఇది మంచి ధోరణి.  దీన్ని  మరింత పెంచాలి. ఈ సంవత్సరం మీకు ఇష్టమైన ఐదు పుస్తకాల గురించి చెప్పమని 'మన్ కీ బాత్' శ్రోతలను కూడా నేను అడుగుతున్నాను. ఈ విధంగా, మీరు 2022లో మంచి పుస్తకాలను ఎంచుకోవడానికి ఇతర పాఠకులకు కూడా సహాయం చేయగలుగుతారు. మన స్క్రీన్ టైమ్ పెరుగుతున్న తరుణంలో పుస్తక పఠనం మరింత ప్రాచుర్యం పొందేందుకు మనం కలిసి కృషి చేయాలి.

నా ప్రియమైన దేశప్రజలారా!  ఇటీవల నా దృష్టి ఒక ఆసక్తికరమైన ప్రయత్నంపైకి  మళ్లింది. మన ప్రాచీన గ్రంథాలకు, సాంస్కృతిక విలువలకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా ప్రాచుర్యం పొందేందుకు ఈ ప్రయత్నం. పూణేలో భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఒక కేంద్రం ఉంది. మహాభారత  ప్రాముఖ్యతను ఇతర దేశాల ప్రజలకు పరిచయం చేయడానికి ఈ సంస్థ ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు ఇప్పుడే ప్రారంభించినప్పటికీ ఇందులో బోధించే అంశాల రూపకల్పన 100 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్టు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. మన సంప్రదాయంలోని వివిధ అంశాలను ఆధునిక పద్ధతిలో ఎలా ప్రదర్శిస్తున్నారో ప్రజలకు తెలియజేసేందుకు నేను ఈ అద్భుతమైన చొరవ గురించి చర్చిస్తున్నాను. సప్తసముద్రాల అవతల ఉన్న ప్రజలకు దీని ప్రయోజనాలను అందజేసేందుకు కూడా వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు.

మిత్రులారా! నేడు భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రపంచంలో పెరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన వారు మన సంస్కృతిని తెలుసుకోవాలనే కుతూహలంతో ఉండటమే కాకుండా దానిని పెంచేందుకు సహకరిస్తున్నారు. అలాంటి వారిలో సెర్బియాకు చెందిన విద్యావేత్త డాక్టర్ మోమిర్ నికిచ్ ఒకరు. అతను సంస్కృత-సెర్బియన్ ద్విభాషా నిఘంటువును రూపొందించారు. ఈ నిఘంటువులో చేర్చిన 70 వేలకు పైగా సంస్కృత పదాలను  సెర్బియన్ భాషలోకి అనువదించారు. డాక్టర్ నికిచ్ 70 ఏళ్ల వయసులో సంస్కృత భాష నేర్చుకున్నారని తెలుసుకోవడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.  మహాత్మాగాంధీ వ్యాసాలను చదివి తాను స్ఫూర్తి పొందానని ఆయన చెప్తారు. ఇదే విధమైన ఉదాహరణ మంగోలియాకు చెందిన 93 సంవత్సరాల ప్రొఫెసర్ జె. గొందె ధరమ్  గారిది. గత 4 దశాబ్దాలలో ఆయన భారతదేశంలోని 40 పురాతన గ్రంథాలు, ఇతిహాసాలు, రచనలను మంగోలియన్ భాషలోకి అనువదించారు. మన దేశంలో కూడా చాలా మంది ఇలాంటి అభిరుచితో పనిచేస్తున్నారు. గోవాకు చెందిన సాగర్ ములే గారి కృషి గురించి కూడా నేను తెలుసుకున్నాను. శతాబ్దాల క్రితం నాటి 'కావి' చిత్రకళ అంతరించిపోకుండా కాపాడడంలో ఆయన నిమగ్నమయ్యారు.  'కావి' చిత్రకళ భారతదేశపు ప్రాచీన చరిత్రను స్వయంగా వివరిస్తుంది. 'కావ్' అంటే ఎర్ర మట్టి. ప్రాచీన కాలంలో ఈ కళలో ఎర్ర మట్టిని ఉపయోగించేవారు. గోవా పోర్చుగీసు పాలనలో ఉన్న సమయంలో అక్కడి నుంచి వలస వచ్చిన వారు ఇతర రాష్ట్రాల ప్రజలకు ఈ అద్భుతమైన చిత్రకళను పరిచయం చేశారు. కాలక్రమేణా ఈ చిత్రకళ అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. కానీ సాగర్ ములే గారు ఈ కళకు కొత్త జీవం పోశారు. ఆయన ప్రయత్నాలకు ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. మిత్రులారా! ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న అడుగు కూడా మన గొప్ప కళల పరిరక్షణలో చాలా సహకారం అందిస్తాయి.

మన దేశ ప్రజలు దృఢ సంకల్పంతో ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న మన ప్రాచీన కళలను అందంగా తీర్చిదిద్ది, కాపాడుకోవాలనే తపన ఒక ప్రజా ఉద్యమ రూపం పొందవచ్చు. నేను ఇక్కడ కొన్ని ప్రయత్నాల గురించి మాత్రమే మాట్లాడాను. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. నమో యాప్ ద్వారా మీరు వాటి సమాచారాన్ని తప్పనిసరిగా నాకు తెలియజేయాలి.

నా ప్రియమైన దేశ ప్రజలారా! అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు ఒక సంవత్సరం నుండి ఒక ప్రత్యేకమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దానికి ‘అరుణాచల్ ప్రదేశ్ ఎయిర్‌గన్ సరెండర్ అభియాన్’ అని పేరు పెట్టారు. ఈ ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఎయిర్‌గన్‌లను అప్పగిస్తున్నారు. ఎందుకో తెలుసా? తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌లో విచక్షణారహితంగా జరిగే పక్షుల వేటను అరికట్టవచ్చు. మిత్రులారా! అరుణాచల్ ప్రదేశ్ 500 కంటే ఎక్కువ జాతుల పక్షులకు నిలయం. వీటిలో కొన్ని దేశీయ జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కానీ క్రమంగా ఇప్పుడు అడవుల్లో పక్షుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు దీన్ని సరిదిద్దేందుకే ఈ ఎయిర్‌గన్ సరెండర్ ప్రచారం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా పర్వతం నుండి మైదానాల వరకు, ఒక సమాజం నుండి మరొక సమాజం వరకు, రాష్ట్రంలోని ప్రతిచోటా ప్రజలు హృదయపూర్వకంగా దీనిని స్వీకరించారు.అరుణాచల్ ప్రజలు తమ ఇష్టపూర్వకంగా 1600 కంటే ఎక్కువ ఎయిర్‌గన్‌లను అప్పగించారు. ఇందుకు అరుణాచల్ ప్రజలను ప్రశంసిస్తున్నాను. వారిని అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! మీ అందరి నుండి 2022కు  సంబంధించి చాలా సందేశాలు, సూచనలు వచ్చాయి. ప్రతిసారిలాగే చాలా మంది వ్యక్తుల సందేశాలలో ఒక అంశం ఉంది. ఇది పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ కు సంబంధించింది. ఈ పరిశుభ్రత సంకల్పం క్రమశిక్షణ, జాగరూకత, అంకితభావంతో మాత్రమే నెరవేరుతుంది. ఎన్. సి. సి. క్యాడెట్లు ప్రారంభించిన పునీత్ సాగర్ అభియాన్‌లో కూడా మనం దీని సంగ్రహావలోకనం చూడవచ్చు. ఈ ప్రచారంలో 30 వేల మందికి పైగా ఎన్‌సిసి క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ ఎన్‌సీసీ క్యాడెట్లు బీచ్‌లను శుభ్రం చేశారు. అక్కడి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి రీసైక్లింగ్ కోసం సేకరించారు. పరిశుభ్రత ఉన్నప్పుడే మన బీచ్‌లు, మన పర్వతాలు సందర్శించడానికి అనువుగా ఉంటాయి. జీవితాంతం ఏదో ఒక ప్రదేశానికి వెళ్లాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అక్కడికి వెళ్ళి  తెలిసో తెలియకో చెత్త కూడా వ్యాపింపజేస్తారు.  మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే ప్రదేశాలను అపరిశుభ్రంగా మార్చకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి దేశవాసిపై ఉంది.

మిత్రులారా! కొంతమంది యువకులు ప్రారంభించిన ‘సాఫ్ వాటర్’ అనే స్టార్టప్ గురించి నాకు తెలిసింది. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ సహాయంతో ఇది ప్రజలకు వారి ప్రాంతంలోని నీటి స్వచ్ఛత, నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది పరిశుభ్రత  తదుపరి దశ. ప్రజల స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ స్టార్టప్  ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, దీనికి గ్లోబల్ అవార్డు కూడా లభించింది.

మిత్రులారా!  ఈ ప్రయత్నంలో 'పరిశుభ్రత వైపు ఒక అడుగు' ప్రచారంలో ప్రతి ఒక్కరి పాత్రా ప్రధానమైంది.  సంస్థలు కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు.. ప్రతి ఒక్కరి పాత్రా ముఖ్యమైందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫైళ్లు, కాగితాలు ఎక్కువగా ఉండేవన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం పాత పద్ధతులను మార్చడం ప్రారంభించినప్పటి నుండి ఈ ఫైళ్లు, కాగితాలు  డిజిటలైజ్ అయి,  కంప్యూటర్ ఫోల్డర్‌లో నిల్వ ఉంటున్నాయి. పాత, పెండింగ్‌లో ఉన్న మెటీరియల్‌ను తొలగించడానికి మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ప్రత్యేక ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఈ పరిశుభ్రతా  డ్రైవ్ ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న జంక్‌యార్డ్ పూర్తిగా ఖాళీ అయింది. ఇప్పుడు ఈ జంక్‌యార్డ్ ను ప్రాంగణంగా, ఫలహారశాలగా మార్చారు. మరో జంక్‌యార్డ్‌ను ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ప్రాంతంగా మార్చారు. అదేవిధంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ దాని ఖాళీగా ఉన్న జంక్‌యార్డ్‌ను వెల్‌నెస్ సెంటర్‌గా మార్చింది. పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్లీన్ ఏటీఎంను కూడా ఏర్పాటు చేసింది. దీని ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు చెత్తను ఇవ్వడం, బదులుగా నగదు తీసుకోవడం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖలోని విభాగాలు ఎండు ఆకులు, చెట్ల నుండి పడే సేంద్రీయ వ్యర్థాల నుండి సేంద్రీయ కంపోస్ట్‌ను తయారు చేయడం ప్రారంభించాయి. ఈ విభాగం వేస్ట్ పేపర్‌తో స్టేషనరీని తయారు చేసేందుకు కూడా కృషి చేస్తోంది. మన ప్రభుత్వ శాఖలు కూడా పరిశుభ్రత వంటి అంశంపై చాలా వినూత్నంగా ఆలోచిస్తాయి. కొన్నాళ్ల క్రితం వరకు ఎవరూ నమ్మలేదు కానీ నేడు అది వ్యవస్థలో భాగమైపోతోంది. దేశప్రజలందరూ కలసి నడిపిస్తున్న దేశపు కొత్త ఆలోచన ఇది.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి 'మన్ కీ బాత్'లో కూడా మనం అనేక అంశాలపై మాట్లాడుకున్నాం. ప్రతిసారిలాగే ఇప్పుడు కూడా  ఒక నెల తర్వాత కలుద్దాం. మనం మళ్ళీ కలుద్దాం- కానీ, 2022లో. ప్రతి కొత్త ప్రారంభం మన  సామర్థ్యాన్ని గుర్తించే అవకాశాన్ని తెస్తుంది. ఆ లక్ష్యాలు ఇంతకు ముందు మనం ఊహించనివి కూడా కావచ్చు. నేడు దేశం వాటి కోసం ప్రయత్నాలు చేస్తోంది.

క్షణశః కణశశ్చైవవిద్యామ్ అర్థం చ సాధయేత్

క్షణో నష్టే కుతో విద్యాకణే నష్టే కుతో ధనమ్

అంటే మనం జ్ఞానాన్ని సంపాదించాలనుకున్నప్పుడు, ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  మనం డబ్బు సంపాదించవలసి వచ్చినప్పుడు, అంటే పురోగతి చెందవలసివచ్చినప్పుడు ప్రతి కణాన్ని- అంటే ప్రతి వనరును సముచితంగా ఉపయోగించాలి. ఎందుకంటే క్షణం నష్టపోతే జ్ఞానం, విద్య  పోతాయి. వనరుల నష్టంతో సంపదకు, పురోగమనానికి దారులు మూసుకుపోతాయి. ఈ విషయం మన దేశవాసులందరికీ స్ఫూర్తిదాయకం. మనం చాలా నేర్చుకోవాలి. కొత్త ఆవిష్కరణలు చేయాలి. కొత్త లక్ష్యాలను సాధించాలి.  అందుకే క్షణం కూడా వృధా చేయకుండా ఉండాలి. మనం దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. కాబట్టి మన ప్రతి వనరును పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఒకరకంగా ఇది స్వావలంబన భారతదేశ మంత్రం కూడా.  ఎందుకంటే మనం మన వనరులను సక్రమంగా ఉపయోగించినప్పుడు వాటిని వృధా చేయనివ్వం. అప్పుడే స్థానిక శక్తిని గుర్తిస్తాం. అప్పుడే దేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది. కాబట్టి ఉన్నతంగా ఆలోచించాలని, ఉన్నతంగా కలలు కనాలని, వాటిని సాకారం చేసేందుకు కృషి చేయాలని మన సంకల్పాన్ని మళ్ళీ  చెప్పుకుందాం. మన కలలు మనకు మాత్రమే పరిమితం కావు. మన కలలు మన సమాజం, దేశ  అభివృద్ధికి సంబంధించినవిగా ఉంటాయి. మన పురోగతి దేశ పురోగతికి మార్గాన్ని తెరుస్తుంది.  దీని కోసం ఈ రోజు నుండి మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా, ఒక్క కణాన్ని కూడా కోల్పోకుండా పని చేయాలి. ఈ సంకల్పంతో రాబోయే సంవత్సరంలో దేశం ముందుకు సాగుతుందని, 2022 నవ భారత నిర్మాణానికి బంగారు పుట అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ నమ్మకంతో  మీ అందరికీ 2022 శుభాకాంక్షలు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
When PM Modi Visited ‘Mini India’: A Look Back At His 1998 Mauritius Visit

Media Coverage

When PM Modi Visited ‘Mini India’: A Look Back At His 1998 Mauritius Visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11మార్చి 2025
March 11, 2025

Appreciation for PM Modi’s Push for Maintaining Global Relations