QuoteInaugurates and lays foundation stone of multiple airport projects worth over Rs 6,100 crore
QuoteDevelopment initiatives of today will significantly benefit the citizens, especially our Yuva Shakti: PM
QuoteIn the last 10 years, we have started a huge campaign to build infrastructure in the country: PM
QuoteKashi is model city where development is taking place along with preservation of heritage:PM
QuoteGovernment has given new emphasis to women empowerment ,society develops when the women and youth of the society are empowered: PM

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తర ప్ర‌దేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాల‌కు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. రూ.6,100 కోట్లకు పైగా విలువైన పలు విమానాశ్రయాల ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.

 

|

ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి మాట్లాడుతూ ఆర్‌జె శంకర కంటి ఆసుపత్రిని ఇవాళ ఉదయం ప్రారంభించినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ఈ రోజు కాశీకి శుభ సందర్భమమని అన్నారు. వృద్ధులు, చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ.. బాబత్‌పూర్ విమానాశ్రయం, ఆగ్రా సహ్రాన్ పూర్‌కు చెందిన సర్సావా విమానాశ్రయంతో సహా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో విమానాశ్రయ టెర్మినళ్లను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం తదితర రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను వారణాసికి అంకింతం చేశామని, ఇది ప్రజలకు అందే సేవలను మెరుగుపరచటమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. కొద్ది రోజుల కిందట అభిధమ్మ దివాస్‌లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసిన మోదీ.. బుద్ధ భగవానుడి భూమి అయిన సారనాథ్ అభివృద్ధికి సంబంధించి కోట్లాది రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు. పాళీ, ప్రాకృత భాషలతో సారనాథ్, వారణాసిలకు ఉన్న అనుబంధాన్ని తెలిపిన ప్రధాని.. ఇటీవల వాటికి ప్రాచీన భాష హోదాను ఇచ్చినట్లు తెలిపారు. గ్రంథాల్లో ఉపయోగించే భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించడం గర్వకారణమన్నారు. ఇవాళ ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన అభివృద్ధి ప‌థకాలకు సంబంధించి కాశీ, దేశ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. 

 

వారణాసి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మూడు రెట్లు ఎక్కువగా పనిచేస్తానని ఇచ్చిన హామీని గుర్తు ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 125 రోజుల్లోనే రూ.15 లక్షల కోట్లకు పైగా విలువైన వివిధ పథకాలు, ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. వీటిలో అత్యధిక భాగం పేదలు, రైతులు, యువతకు కేటాయించినట్లు తెలిపారు. దశాబ్దం కిందట పత్రికల్లో వచ్చే కుంభకోణాల గురించి చర్చ జరిగేదని, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో రూ.15 లక్షల కోట్ల పనులపై చర్చ జరుగుతోందన్నారు. దేశ ప్రగతితో పాటు ప్రజల డబ్బును ప్రజల కోసం ఖర్చు చేయాలని దేశం కోరుకుందని, దీనికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ అత్యంత నిజాయితీతో పనిచేస్తుందని అన్నారు. 

 

ప్రజలకు అందించే సేవలను మెరుగుపరచడం, పెట్టుబడుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అనే రెండు ప్రధాన లక్ష్యాలతో గత పదేళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా పనులు ప్రారంభించిందని ప్రధాన మంత్రి చెప్పారు. అధునాతన రహదారుల అభివృద్ధి పనులు, కొత్త మార్గాల్లో రైల్వే లైన్లను వేయడం, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు వంటి వాటిని ఉదాహరణలుగా చెబుతూ.. ఇవన్నీ ప్రజలకు సౌలభ్యాన్ని పెంచుతాయని, అదే సమయంలో ఉపాధిని కల్పిస్తాయని అన్నారు. బాబత్‌పూర్ విమానాశ్రయానికి రహదారి నిర్మాణం వల్ల ప్రయాణికులకు లాభం జరగటమే కాకుండా వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ఊతం లభిస్తుందన్నారు. విమానాల విషయంలో నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి బాబత్‌పూర్ విమానాశ్రయ విస్తరణకు ఇప్పటికే పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

 

|

దేశంలోని విమానాశ్రయాలు, వాటిలో అత్యద్భుతమైన సదుపాయాలున్న అద్భుత భవంతులు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయని ఆయన అన్నారు. 2014లో కేవలం 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం పాత విమానాశ్రయాల పునరుద్ధరణ పనులతో పాటు 150కి పైగా విమానాశ్రయాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ఏడాది అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకూట్ విమానాశ్రయాలతో సహా దేశంలోని డజనుకు పైగా విమానాశ్రయాల్లో నూతన సదుపాయాల నిర్మాణం పూర్తి అయిందని ఆయన తెలిపారు. అయోధ్యలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిరోజూ రామ భక్తులకు స్వాగతం పలుకుతోందన్నారు. శిథిలావస్థలో ఉన్న రోడ్లను తిట్టిపోసుకునే గతానికి భిన్నంగా నేడు ఉత్తరప్రదేశ్‌ను 'ఎక్స్ ప్రెస్ రహదారుల రాష్ట్రం'గా పిలిస్తున్నారని గుర్తుచేశారు. అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రంగా నేడు రాష్ట్ర ప్రసిద్ధి చెందిందని ఆయన అన్నారు. నోయిడాలోని జెవార్‌లో త్వరలో భారీ అంతర్జాతీయ విమానాశ్రయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులతో పాటు రాష్ట్ర యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలియజేశారు. 


వారణాసి అభివృద్ధి చెందుతోన్న వేగం పట్ల వారణాసి పార్లమెంటు సభ్యుడిగా సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి మోదీ.. అభివృద్ది, సాంస్కృతిక వారసత్వం కలిసి సాగే కాశీని పట్టణాభివృద్ధిలో ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలన్న తన కలను పునరుద్ఘాటించారు. బాబా విశ్వనాథ్ మహత్తరమైన, దివ్యమైన క్షేత్రం..రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్, రింగ్ రోడ్డు, గంజారి స్టేడియం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రోప్ వే వంటి ఆధునిక సౌకర్యాలతో నేడు కాశీ గుర్తింపు పొందిందన్నారు. నగరంలోని విశాలమైన రోడ్లు, గంగానది అందమైన ఘాట్లు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి అని అన్నారు. 

కాశీని, పూర్వాంచల్‌ను వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు పెద్ద కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది.. గంగా నదిపై 6 వరుసల రహదారి, రైల్వే లైన్లతో కూడిన కొత్త రైలు-రోడ్డు వంతెన నిర్మాణానికి ఆమోదం లభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది వారణాసి, చందౌలి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. 

కాశీ ఇప్పుడు క్రీడలకు చాలా పెద్ద కేంద్రంగా మారుతోంది అని మోదీ అన్నారు. పునరుద్ధరించిన సిగ్రా స్టేడియం ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉందని, క్రీడలకు ఆధునిక సౌకర్యాలతో పాటు జాతీయ పోటీల నుంచి ఒలింపిక్స్ వరకు సన్నద్ధం అయ్యేందుకు ఈ కొత్త స్టేడియంలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాశీలోని యువ క్రీడాకారుల సామర్థ్యం గురించి మాట్లాడుతూ.. పార్లమెంటు సభ్యుల క్రీడా పోటీల సందర్భంగా ఇది స్పష్టంగా కనిపించిందన్నారు. ఇప్పుడు పూర్వాంచల్‌లోని యువకులు పెద్ద పోటీలకు సిద్ధం కావడానికి మంచి సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. 

 

|

మహిళలు, యువత సాధికారత సాధించినప్పుడే సమాజాభివృద్ధి జరుగుతుందన్న మోదీ.. ప్రభుత్వం మహిళలకు కొత్త శక్తిని ఇచ్చిందని తెలిపారు. ముద్ర యోజన వంటి పథకాల ద్వారా కోట్లాది మంది మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి రుణాలు పొందారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు గ్రామాల్లో 'లకపతీ దీదీ (లక్షాధికారులైన మహిళలు)'లను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, మహిళలు డ్రోన్ పైలట్లుగా కూడా మారుతున్నారని అన్నారు. శివుడు కూడా అన్నపూర్ణా దేవి నుండి భిక్షాటన కోరతాడన్న విశ్వాసం కాశీలో ఉందని చెప్పిన మోదీ.. వికసిత్ భారత్ లక్ష్యం కోసం నారీశక్తిని ప్రతి కార్యక్రమానికి కేంద్రంగా ఉంచేందుకు ఈ విశ్వాసం ప్రభుత్వాన్ని ప్రేరేపించిందని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద వారణాసి మహిళలతో సహా లక్షలాది మంది మహిళలకు సొంత ఇళ్లు ఇచ్చామని ఆయన ఉద్ఘాటించారు. మరో మూడు కోట్ల ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పీఎం ఆవాస్ పథకం కింద ఇంకా ఇళ్లు అందని మహిళలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కుళాయి నీళ్లు, ఉజ్వల గ్యాస్, విద్యుత్తును అందించడంతో పాటు కొత్తగీ తీసుకొచ్చిన పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం మహిళల జీవితాలను మరింత సులభతరం చేస్తుందని అన్నారు. ఉచిత విద్యుత్ ద్వారా ప్రయోజనం పొందడానికి, సంపాదించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. 


"మన కాశీ బహుముఖ సాంస్కృతిక నగరం. శంకరుని పవిత్ర జ్యోతిర్లింగం, మణికర్ణిక వంటి మోక్ష తీర్థం. సారనాథ్ వంటి జ్ఞాన ప్రదేశం" అని మోదీ అన్నారు. దశాబ్ధాల తర్వాత మాత్రమే బనారస్ అభివృద్ధికి ఏకకాలంలో ఇన్ని పనులు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. వారణాసి విషయంలో పేలవమైన అభివృద్ధి, పురోగతిపై గత ప్రభుత్వాలను ప్రశ్నించిన మోదీ.. తమ ప్రభుత్వం ఏ పథకంలోనూ ఎలాంటి వివక్ష లేకుండా సబ్ కా సాథ్ మంత్రం, సబ్ కా విశ్వాస్ మంత్రంతో పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉందని, ఇచ్చిన మాట ప్రకారం అయోధ్యలో నిర్మించిన బ్రహ్మాండమైన రామ మందిరాన్ని ఉదహరించారు. విధాన సభ, లోక్ సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన చారిత్రాత్మక ఘట్టాన్ని ఆయన ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం, వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి ఇతర విజయాల గురించి ఆయన మాట్లాడారు. 


“చిత్తశుద్ధితో పనిచేశాం. సదుద్దేశంతో విధానాలను అమలు చేశాం. దేశంలోని ప్రతి కుటుంబం జీవితాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నాం” అని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా దేశ ప్రజలు తమకు ఆశీస్సులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల హర్యానాలో అధికారంలో ఉన్న తమ పార్టీనే మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో రికార్డు స్థాయిలో ఓట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

 

|

వారసత్వ రాజకీయాలు దేశానికి, ముఖ్యంగా యువతకు పెనుముప్పు అని పేర్కొన్న ప్రధాన మంత్రి.. ఇటువంటి రాజకీయాలు తరచుగా యువతకు అవకాశాలను దూరం చేస్తాయని వివరించారు. రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువకులను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎర్రకోట నుంచి పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు. దీనివల్ల అవినీతి, కుటుంబపరమైన స్వార్థ ఆలోచనలను నిర్మూలించవచ్చని, తద్వారా దేశ రాజకీయాల దశదిశ మారుతుందని ప్రధానంగా చెప్పారు. కాశీ, ఉత్తర్ ప్రదేశ్ యువతను ప్రోత్సహిస్తూ, "ఈ కొత్త రాజకీయ ఉద్యమానికి యువత కేంద్ర బిందువు కావాలని నేను కోరుతున్నాను. కాశీ పార్లమెంటు సభ్యుడిగా వీలైనంత ఎక్కువ మంది యువతను ముందుకు తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాను” అని వ్యాఖ్యానించారు. ప్రసంగాన్ని ముగిస్తూ.. కాశీ యావత్ దేశానికి అభివృద్ధి విషయంలో కొత్త ప్రమాణాలకు చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. ఈ రోజు ప్రారంభించిన నూతన అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్రా, కాశీ ప్రజలను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

అనుసంధానాన్ని పెంచాలన్న నిబద్ధతకు అనుగుణంగా వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు సుమారు రూ.2870 కోట్లతో రన్ వే విస్తరణ, కొత్త టెర్నినల్ నిర్మాణం, దాని అనుబంధ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.570 కోట్లతో ఆగ్రా విమానాశ్రయంలో, సుమారు రూ.910 కోట్లతో దర్భంగా విమానాశ్రయంలో, సుమారు రూ.1550 కోట్లతో బాగ్డోగ్రా విమానాశ్రయంలో నిర్మించనున్న నూతన సివిల్ ఎన్‌క్లేవ్‌లకు శంకుస్థాపన చేశారు. 

 

|

రూ.220 కోట్లకు పైగా విలువ చేసే రేవా విమానాశ్రయం, మా మహామాయా విమానాశ్రయం, అంబికాపూర్, సర్సావా విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాలను ప్రధాని ప్రారంభించారు. ఈ విమానాశ్రయాల మొత్తం ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం ఏటా 2.3 కోట్లకు పైకి చేరుకుంటుంది. ఈ విమానాశ్రయాల డిజైన్లు ఆయా  ప్రాంతంలోని సాంస్కృతిక వారసత్వ నిర్మాణాలను తెలియజేస్తాయి. 

 

|

క్రీడలకు అత్యున్నత, నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్న తమ దార్శనికతకు అనుగుణంగా..ఖేలో ఇండియా పథకం, స్మార్ట్ సిటీ మిషన్ కింద రూ.210 కోట్లకు పైగా విలువ చేసే వారణాసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పునర్నిర్మాణానికి సంబంధించిన 2, 3 దశలను ప్రధాన మంత్రి ప్రారంభించారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, క్రీడాకారుల హాస్టళ్లు, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, వివిధ క్రీడల గ్రౌండ్లు, ఇండోర్ షూటింగ్ రేంజ్‌లు, కంబాట్ స్పోర్ట్స్ ఎరీనాలతో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. లాల్‌పూర్‌లోని డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ స్పోర్ట్స్ స్టేడియంలో 100 పడకల బాలికల, బాలుర హాస్టళ్లను, పబ్లిక్ పెవిలియన్‌ను ఆయన ప్రారంభించారు.

 

సారనాథ్‌లో బౌద్ధమత సంబంధిత ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. పాదచారులకు అనుగుణంగా ఉండే ఏర్పాటు, కొత్త మురుగునీటి కాల్వలు, డ్రైనేజీ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయటం, స్థానిక హస్తకళల విక్రేతలను ప్రోత్సహించడానికి ఆధునిక డిజైనర్ విక్రయ కేంద్రాలతో కూడిన వ్యవస్థీకృత వ్యాపార జోన్లతో పాటు ఇతర పనులు ఇందులో ఉన్నాయి. బనాసూర్ టెంపుల్, గురుధామ్ టెంపుల్ వద్ద పర్యాటక అభివృద్ధి పనులతో పాటు పార్కుల సుందరీకరణ, పునర్నిర్మాణం వంటి పలు కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How the makhana can take Bihar to the world

Media Coverage

How the makhana can take Bihar to the world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 ఫెబ్రవరి 2025
February 25, 2025

Appreciation for PM Modi’s Effort to Promote Holistic Growth Across Various Sectors