నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం! ఈ ఆగస్టు నెలలోమీ ఉత్తరాలు, సందేశాలు, కార్డులు అన్నీ నా కార్యాలయాన్ని త్రివర్ణమయం చేశాయి. త్రివర్ణ పతాకం లేని లేదా త్రివర్ణ పతాకం, స్వేచ్ఛ గురించిన్ విషయాలు లేని ఏ లేఖను నేను బహుశా చూడలేదు. పిల్లలు, యువ స్నేహితులు అమృత మహోత్సవం సందర్భంగా అందమైన చిత్రాలను, కళాకృతులను పంపారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ మాసంలో మన దేశంలో, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో అమృత మహోత్సవఅమృతధార ప్రవహిస్తోంది. అమృత మహోత్సవంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఈ ప్రత్యేక సందర్భంలో దేశ సామూహిక శక్తిని మనం చూశాం. చైతన్య అనుభూతిని పొందాం. ఇంత పెద్ద దేశంలో ఎన్నో వైవిధ్యాలు. కానీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు అందరూ ఒకే భావనతో వ్యవహరించినట్టు అనిపించింది. త్రివర్ణ పతాక గౌరవాన్ని కాపాడడంలో ప్రథమ రక్షకులుగా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చారు. స్వచ్చతా అభియాన్ లోనూ టీకా ప్రచారంలోనూ దేశ స్ఫూర్తిని కూడా మనం చూశాం. అమృత మహోత్సవంలో మళ్లీ అదే దేశభక్తి స్ఫూర్తిని చూడబోతున్నాం.ఎత్తైన పర్వతాల శిఖరాలపైనా, దేశ సరిహద్దుల్లోనూ, సముద్రం మధ్యలోనూ కూడా మన సైనికులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. త్రివర్ణ పతాక ప్రచారానికి ప్రజలు కూడా విభిన్నమైన వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చారు. అలా వచ్చిన యువ సహచరుడు కృష్నీల్ అనిల్ గారు. అనిల్ గారు ఒక పజిల్ కళాకారుడు. రికార్డు సమయంలో మొజాయిక్ కళతో అందమైన త్రివర్ణ పతాకాన్ని సృష్టించారు.కర్ణాటకలోని కోలార్‌లో 630 అడుగుల పొడవు, 205 అడుగుల వెడల్పుతో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని అపురూప దృశ్యాన్ని ప్రదర్శించారు. అస్సాంలోని ప్రభుత్వ ఉద్యోగులు దిఘాలిపుఖురి యుద్ధ స్మారకం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు తమ స్వహస్తాలతో 20 అడుగుల త్రివర్ణ పతాకాన్ని తయారు చేశారు. అదేవిధంగాఇండోర్‌లోని ప్రజలు మానవహారం ద్వారా భారతదేశ పటాన్ని రూపొందించారు.చండీగఢ్‌లో యువకులు భారీ మానవ త్రివర్ణ పతాకాన్ని తయారు చేశారు. ఈ రెండు ప్రయత్నాలూ గిన్నిస్ రికార్డులో కూడా నమోదయ్యాయి. వీటన్నింటి మధ్యలోహిమాచల్ ప్రదేశ్‌లోని గంగోట్ పంచాయితీ నుండి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ కూడా కనిపించింది.ఇక్కడ పంచాయతీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో వలస కూలీల పిల్లలను ముఖ్య అతిథులుగా భాగస్వాములను చేశారు.
మిత్రులారా!అమృత మహోత్సవంలోని ఈ వర్ణాలు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా కనిపించాయి. బోట్స్ వానాలో నివసిస్తున్న స్థానిక గాయకులు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 దేశభక్తి గీతాలను ఆలపించారు. ఇందులో విశేషమేమిటంటేఈ 75 పాటలు హిందీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, తమిళం, తెలుగు, కన్నడ , సంస్కృతం వంటి భాషల్లో పాడారు. అదేవిధంగా నమీబియాలో ఇండో-నమీబియా సాంస్కృతిక-సాంప్రదాయిక సంబంధాలపై ప్రత్యేక స్టాంపును విడుదల చేశారు.
మిత్రులారా!నేను మరో సంతోషకరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితంభారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు లభించింది. అక్కడ 'స్వరాజ్' దూరదర్శన్ సీరియల్ ను ప్రదర్శించారు. ఆ సీరియల్ ప్రీమియర్‌కి వెళ్లే అవకాశం నాకు లభించింది.స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుని, గుర్తింపు పొందని వీరులు, వీరవనితల కృషిని దేశంలోని యువ తరానికి పరిచయం చేసేందుకు ఇదో గొప్ప కార్యక్రమం. ఇది ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు దూరదర్శన్‌లో ప్రసారమవుతుంది.ఈ సీరియల్ 75 వారాల పాటు కొనసాగుతుందని నాకు చెప్పారు. మీరు సమయాన్ని వెచ్చించి మీరు చూడడంతో పాటు మీ ఇంట్లోని పిల్లలకు కూడా చూపించాలని నేను కోరుతున్నాను. పాఠశాలలు, కాలేజీల వారు ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసి; సోమవారం పాఠశాలలు, కాలేజీలు తెరిచినప్పుడు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ చూపించాలని నేను కోరుతున్నాను. తద్వారా స్వాతంత్ర్య సముపార్జన కోసం శ్రమించిన ఈ గొప్ప వీరుల పట్ల మన దేశంలో అవగాహన కలుగుతుంది. స్వతంత్ర భారత అమృత మహోత్సవాలు వచ్చే ఏడాది వరకు – అంటే 2023 ఆగస్టు వరకు జరుగుతాయి. దేశం కోసం, స్వాతంత్ర్య సమరయోధుల కోసంమనం చేస్తున్న రచనలను, కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!నేటికీ మన పూర్వికుల జ్ఞానం, మన పూర్వికుల దూరదృష్టి, మన పూర్వికుల అంతర్దర్శనంఈరోజుకీ ఎంతో ప్రభావశీలత కలిగిఉన్నాయి. ఈ విషయాలపై లోతుల్లోకి తరచి చూస్తే మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
ఓమాన్-మాపో మానుషీ:అమృక్తమం ధాత్ తోకాయ్ తనయాయ్ శం యోః|
యూయం హిష్ఠా భిషజో మాతృతమా విశ్వస్య స్థాతు: జగతో జనిత్రీ: ||
అని వేల సంవత్సరాల నాటిమన ఋగ్వేదంలో చెప్పారు.
“ఓ జలమా! నువ్వేమానవాళికి మంచి స్నేహితుడివి. జీవాన్ని ఇచ్చేది కూడా నువ్వే. నీ నుండి ఆహారం ఉత్పత్తి అవుతుంది. నీవే మా పిల్లలకు ప్రయోజనకారి. నువ్వే మాకు రక్షణ కల్పించేది. మమ్మల్ని అన్ని చెడుల నుండి దూరంగా ఉంచేది కూడా నువ్వే. నువ్వే అత్యుత్తమ ఔషధం. ఈ బ్రహ్మాండాన్ని పెంచి పోషించేది నువ్వే.” అని దీని అర్థం.
ఆలోచించండి… నీటి గురించి, నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతిలో పేర్కొన్నారు. నేటి సందర్భంలో ఈ జ్ఞానాన్ని చూసినప్పుడుమనం పులకించిపోతాం. దేశం ఈ జ్ఞానాన్ని తన శక్తిగా స్వీకరించినప్పుడు దేశ సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది…నాలుగు నెలల క్రితం 'మన్ కీ బాత్'లో నేను అమృత్ సరోవర్ గురించి మాట్లాడాను. ఆ తర్వాత వివిధ జిల్లాల్లో స్థానిక పరిపాలన జత గూడింది. స్వచ్చంద సంస్థలు తోడయ్యాయి. స్థానిక ప్రజలు భాగస్వాములయ్యారు. చూస్తూ ఉండగానే అమృత్ సరోవర్ నిర్మాణం ప్రజా ఉద్యమంగా మారింది. దేశం కోసం ఏదైనా చేయాలనే భావన ఉన్నప్పుడు, తన కర్తవ్యాన్ని గుర్తించినప్పుడు, రాబోయే తరాల పట్ల ఆలోచన ఉన్నప్పుడు సామర్థ్యం కూడా తోడవుతుంది. సంకల్పం ఉదాత్తమవుతుంది.తెలంగాణలోని వరంగల్ నుండి ఒక గొప్ప ప్రయత్నం గురించి తెలుసుకున్నాను. ఇక్కడ కొత్త గ్రామ పంచాయితీ ఏర్పడింది. ఆ పంచాయతీ పేరు 'మంగ్త్యా-వాల్యా తాండా'. ఈ గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. వర్షాకాలంలో చాలా నీరు నిల్వ ఉండే ప్రాంతం సమీపంలో ఈ పంచాయతీ ఉంది.గ్రామస్థుల చొరవతోఇప్పుడు ఈ స్థలాన్ని అమృత్ సరోవర్ అభియాన్ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఈసారి వర్షాకాలంలో కురిసిన వర్షాల కారణంగా ఈ చెరువు నీటితో నిండిపోయింది.
మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో ఉన్న మోచా గ్రామ పంచాయతీలో నిర్మించిన అమృత్ సరోవర్ గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ అమృత్ సరోవర్ కన్హా నేషనల్ పార్క్ సమీపంలో నిర్మితమైంది. దీనివల్ల ఈ ప్రాంతం అందం మరింత పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన షహీద్ భగత్ సింగ్ అమృత్ సరోవర్ కూడా ప్రజలను ఆకర్షిస్తోంది.నివారి గ్రామ పంచాయతీలో నిర్మించిన ఈ సరస్సు 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. సరస్సు ఒడ్డున ఉన్న తోటలు దాని అందాన్ని పెంచుతున్నాయి. సరస్సు సమీపంలోని35 అడుగుల ఎత్తున్న త్రివర్ణ పతాకాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. కర్ణాటకలోనూ అమృత్ సరోవర్ ఉద్యమం జోరుగా సాగుతోంది.ఇక్కడ బాగల్‌కోట్ జిల్లాలోని 'బిల్కెరూర్' గ్రామంలో ప్రజలు చాలా అందమైన అమృత సరోవరాన్ని నిర్మించారు. వాస్తవానికిఈ ప్రాంతంలోకొండ నుండి నీరు రావడంతో ప్రజలు చాలా నష్టపోయేవారు. రైతులకు నష్టం కలిగేది. వారి పంటలు కూడా దెబ్బతినేవి. అమృత సరోవరం చేసేందుకు గ్రామ ప్రజలు మొత్తం నీటిని కాలువలుగా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో వరద సమస్య కూడా తీరింది.అమృత్ సరోవర్ అభియాన్ నేటి మన అనేక సమస్యలను పరిష్కరించడంతో పాటు రాబోయే తరాలకు కూడా అంతే ఆవశ్యకంగా ఉంది. ఈ ప్రచారంలోచాలా చోట్లపాత నీటి వనరులను కూడా పునరుద్ధరించారు. జంతువుల దాహం తీర్చడంతో పాటు వ్యవసాయానికి కూడాఅమృత సరోవర్‌ను వినియోగిస్తున్నారు.ఈ చెరువుల వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. అదే సమయంలో వాటి చుట్టూ పచ్చదనం కూడా పెరుగుతోంది. ఇదొక్కటే కాదు-అమృత్ సరోవర్‌లో చేపల పెంపకం కోసం చాలా చోట్ల ప్రజలు సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు. అమృత్ సరోవర్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని; ఈ నీటి నిల్వ, నీటి సంరక్షణ ప్రయత్నాలకు పూర్తి శక్తిని అందించి, వాటిని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మలని అందరినీ -ముఖ్యంగా నా యువ మిత్రులను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! అస్సాంలోని బొంగై గ్రామంలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ అమలు జరుగుతోంది. ఆ ప్రాజెక్టు పేరు ప్రాజెక్ట్ సంపూర్ణ. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడటం. ఈ పోరాటం చేసే పద్ధతి కూడా చాలా ప్రత్యేకమైంది. ఇందులోభాగంగా అంగన్‌వాడీ కేంద్రంలోని ఆరోగ్యవంతమైన బిడ్డ తల్లి ప్రతివారం పోషకాహార లోపం ఉన్న పిల్లల తల్లిని కలుసుకుని పౌష్టికాహారానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని చర్చిస్తుంది. అంటేఒక తల్లి మరొక తల్లికి స్నేహితురాలు అవుతుంది. ఆమెకు సహాయం చేస్తుంది. ఆమెకు నేర్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ సహాయంతోఈ ప్రాంతంలోఒక సంవత్సరంలో90 శాతానికి పైగా పిల్లల పోషకాహార లోపాన్ని నిర్మూలించగలిగారు. మీరు ఊహించగలారా! పోషకాహార లోపాన్ని తొలగించడానికి పాటలను, సంగీతాన్ని, భజనలను కూడా ఉపయోగించవచ్చా?మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో జరుగుతున్న "మేరా బచ్చా అభియాన్"లో వీటిని విజయవంతంగా ఉపయోగించారు. దీని కిందజిల్లాలో భజనలను, కీర్తనలను నిర్వహించారు. ఇందులో ‘పోషణ్ గురు’ అని పిలిచే శిక్షకులకు భాగస్వామ్యం కల్పించారు. అంగన్‌వాడీ కేంద్రానికి మహిళలు పిడికెడు ధాన్యాన్ని తీసుకొచ్చి, ఆ ధాన్యంతో శనివారాల్లో 'బాలభోజ్' నిర్వహించే మట్కా కార్యక్రమం కూడా జరిగింది.దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల హాజరు పెరగడంతోపాటు పోషకాహార లోపం కూడా తగ్గుముఖం పట్టింది. పోషకాహార లోపంపై అవగాహన పెంచేందుకు జార్ఖండ్‌లో ప్రత్యేక ఉద్యమం కూడా జరుగుతోంది. జార్ఖండ్‌లోని గిరిడీహ్‌లో పాము-నిచ్చెన ఆటను సిద్ధం చేశారు. ఆటల ద్వారా పిల్లలు మంచి, చెడు అలవాట్లను తెలుసుకుంటారు.
మిత్రులారా!పోషకాహార లోపానికి సంబంధించిన అనేక వినూత్న ప్రయోగాల గురించి నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే రాబోయే నెలలో మనమందరం ఈ ప్రచారంలో చేరాలి. సెప్టెంబరు నెల పండుగలతో పాటు పోషకాహారానికి సంబంధించిన అతి పెద్ద ప్రచారానికి కూడా అంకితమైంది. మనం ప్రతి ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోషణమాసోత్సవాలను జరుపుకుంటాం.
పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక సృజనాత్మక, విభిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాంకేతికతను మెరుగ్గా ఉపయోగించడంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా పోషకాహార ప్రచారంలో ముఖ్యమైన భాగంగా మారింది. దేశంలోని లక్షలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు మొబైల్ పరికరాలను అందించడం నుండి అంగన్‌వాడీ సేవలను అందజేయడం, పర్యవేక్షణలకోసం పోషన్ ట్రాకర్ కూడాప్రారంభమైంది.
అన్ని ఆకాంక్షాత్మక జిల్లాలు -యాస్పిరేషన్ జిల్లాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలలో14 నుండి 18 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లలను పోషణ్ అభియాన్ పరిధిలోకి తీసుకువచ్చారు. పోషకాహార లోపం సమస్యకు పరిష్కారం ఈ దశలకే పరిమితం కాదు - ఈ పోరాటంలోఅనేక ఇతర కార్యక్రమాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకుజల్ జీవన్ మిషన్‌ను తీసుకోండి. భారతదేశాన్ని పోషకాహార లోప రహితంగా మార్చడంలో ఈ మిషన్ కూడా భారీ ప్రభావాన్ని చూపుతుంది.పోషకాహార లోపం సవాళ్లను ఎదుర్కోవడంలో సామాజిక అవగాహన ప్రయత్నాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రాబోయే పోషణ మాసంలో పోషకాహార లోపాన్ని తొలగించే ప్రయత్నాల్లో పాలుపంచుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! చెన్నైకి చెందిన శ్రీదేవి వరదరాజన్ గారు నాకు ఒక విషయాన్ని గుర్తు చేశారు. “కొత్త సంవత్సరం రావడానికి 5 నెలల కన్నా తక్కువ సమయం ఉంది. రాబోయే నూతన సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటామని మనందరికీ తెలుసు” అని ఆమె మై గవ్ లో రాశారు. దేశ చిరుధాన్యాల భౌగోళిక చిత్ర పటాన్ని కూడా ఆమె నాకు పంపారు. 'మన్ కీ బాత్'లో రాబోయే ఎపిసోడ్‌లో మీరు దీని గురించి చర్చించగలరా అని కూడా ఆమె అడిగారు. నా దేశ ప్రజలలో ఇలాంటి స్ఫూర్తిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.భారతదేశం చేసిన ఈ ప్రతిపాదనకు 70కి పైగా దేశాల మద్దతు లభించిందని తెలిసి మీరు కూడా చాలా సంతోషిస్తారు. నేడుప్రపంచవ్యాప్తంగాఈ చిరుధాన్యాలపై మోజు పెరుగుతోంది. మిత్రులారా!నేను చిరు ధాన్యాల గురించి మాట్లాడేటప్పుడునా ప్రయత్నాలలో ఒకదాన్ని మీతో ఈ రోజు పంచుకోవాలనుకుంటున్నాను.కొంతకాలంగా విదేశీ అతిథులు భారత్‌కు వచ్చినప్పుడు, వివిధ దేశాల అధినేతలు భారతదేశానికి వచ్చినప్పుడుభారతదేశంలోని చిరుధాన్యాలతో చేసిన వంటలను తయారుచేయించడం నా ప్రయత్నం. ఆ పెద్దలకు ఈ వంటకాలు చాలా ఇష్టమయ్యాయని అనుభవంలోకి వచ్చింది. మన చిరుధాన్యాల గురించి చాలా సమాచారాన్ని సేకరించడానికి కూడా వారు ప్రయత్నిస్తారు.చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు ప్రాచీన కాలం నుండి మన వ్యవసాయం, సంస్కృతి, నాగరికతలో ఒక భాగం. మన వేదాలలో చిరుధాన్యాల ప్రస్తావన ఉంది. అదే విధంగాపురాణాల్లో, తొల్కాప్పియంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజల ఆహారంలో వివిధ రకాల చిరుధాన్యాలు ఉంటాయి. మన సంస్కృతిలాగే చిరుధాన్యాలు కూడా చాలా వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, కొర్రలు, ఒరిగలు, అరికెలు, సామలు, ఉలవలు - ఇవన్నీ చిరుధాన్యాలే. ప్రపంచంలోనే అత్యధికంగా చిరుధాన్యాలను ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత కూడా భారతీయులమైన మన భుజాలపైనే ఉంది. మనమందరం కలిసి దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి. దేశ ప్రజల్లో చిరుధాన్యాలపై అవగాహన పెంచాలి.మిత్రులారా!మీకు బాగా తెలుసు…చిరుధాన్యాలు రైతులకు- ముఖ్యంగా చిన్న రైతులకు కూడా ప్రయోజనకరం. వాస్తవానికిపంట చాలా తక్కువ సమయంలో సిద్ధంగా ఉంటుంది. దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు. ముఖ్యంగా మన చిన్న రైతులకు చిరుధాన్యాలు మేలు చేస్తాయి. చిరుధాన్యాల గడ్డిని కూడా ఉత్తమ మేతగా పరిగణిస్తారు. ఈ రోజుల్లోయువతరం ఆరోగ్యకరమైన జీవనం, ఆహారంపై చాలా దృష్టి పెడుతుంది.ఈ విధంగా చూసినా చిరుధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. చిరుధాన్యాల్లో ఒకటి కాదు-అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఊబకాయాన్ని తగ్గించడంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి.ఉదర, కాలేయ వ్యాధుల నుండి రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి.కొంతకాలం క్రితమేమనం పోషకాహార లోపం గురించి మాట్లాడుకున్నాం. పోషకాహార లోపంతో పోరాడడంలో చిరుధాన్యాలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి శక్తితో పాటు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. నేడు దేశంలో చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి సారించడంతో పాటుఉత్పత్తిని పెంచేందుకు రైతు ఉత్పత్తి సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. నా రైతు సోదరులు, సోదరీమణులు చిరుధాన్యాలను- అంటే ముతక ధాన్యాలను తమవిగా భావించి, లాభాలు పొందాలని నా కోరిక. చిరుధాన్యాలపై పనిచేస్తున్న అనేక స్టార్టప్‌లు నేడు పుట్టుకొస్తుండటం నాకు చాలా సంతోషకరం. వీరిలో కొందరు మిల్లెట్ కుకీలను తయారు చేస్తుంటే, మరికొందరు మిల్లెట్ పాన్ కేక్స్, దోశలను కూడా తయారు చేస్తున్నారు. మిల్లెట్ ఎనర్జీ బార్‌లు, మిల్లెట్ అల్పాహారాలను తయారు చేస్తున్న వారు కొందరు ఉన్నారు.ఈ రంగంలో పనిచేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు. ఈ పండగ సీజన్‌లో మనం చాలా వంటలలో చిరుధాన్యాలను కూడా ఉపయోగిస్తాం. మీరు మీ ఇళ్లలో తయారు చేసిన అటువంటి వంటకాల చిత్రాలను తప్పనిసరిగా సోషల్ మీడియాలో షేర్ చేయండి. మిల్లెట్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంలో ఇది సహాయపడుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!కొద్ది రోజుల క్రితం, అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలోని జోర్సింగ్ గ్రామం నుండి నేను ఒక వార్త చూశాను. ఈ వార్త ఈ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మార్పు గురించి. వాస్తవానికి ఈ నెలలో జోర్సింగ్ గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచే 4జీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇంతకు ముందు పల్లెల్లో కరెంటు వచ్చినప్పుడు ప్రజలు సంతోషించేవారు. ఇప్పుడు నవ భారతదేశంలో 4జీ వస్తే అదే ఆనందం పొందుతున్నాం. అరుణాచల్, ఈశాన్య మారుమూల ప్రాంతాలలో 4G రూపంలో కొత్త సూర్యోదయమైంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ కొత్త ఉదయాన్ని తెచ్చింది. ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే ఉన్న సౌకర్యాలను డిజిటల్ ఇండియా గ్రామ గ్రామానికీ తీసుకువచ్చింది. దీని వల్ల దేశంలో కొత్త డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆవిర్భవిస్తున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన సేఠా సింగ్ రావత్ గారు'దర్జీ ఆన్‌లైన్' అనే 'ఈ-స్టోర్'ని నిర్వహిస్తున్నారు. ఈ 'దర్జీ ఆన్‌లైన్' అంటే ఏమిటని మీరు ఆలోచిస్తారు. నిజానికి- సేఠా సింగ్ రావత్ గారు కోవిడ్‌కు ముందు టైలరింగ్ పని చేసేవారు.కోవిడ్ వచ్చినప్పుడురావత్ గారు ఈ సవాలును కష్టంగా తీసుకోలేదు. ఒక అవకాశంగా తీసుకున్నారు. ఆయన 'కామన్ సర్వీస్ సెంటర్' అంటే CSC E-స్టోర్‌లో చేరారు. ఆన్‌లైన్‌లో పని చేయడం ప్రారంభించారు. కస్టమర్లు పెద్ద సంఖ్యలో మాస్కుల కోసం ఆర్డర్లు ఇవ్వడాన్ని ఆయన చూశారు. ఆయన కొంతమంది మహిళలను పనిలోకి తీసుకుని మాస్కులు తయారు చేయడం ప్రారంభించారు. దీని తర్వాత ఆయన 'దర్జీ ఆన్‌లైన్' పేరుతో తన ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించారు. అందులోఅనేక ఇతర బట్టలు కూడా అమ్మడం ప్రారంభించారు.నేడుడిజిటల్ ఇండియా శక్తితోసేఠా సింగ్ గారి పని ఎంతగా పెరిగిందంటే ఇప్పుడు ఆయనకు దేశం నలుమూలల నుండి ఆర్డర్లు వస్తున్నాయి. వందలాది మహిళలకు ఆయన ఉపాధి కల్పించారు.ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌లో నివసిస్తున్న ఓం ప్రకాష్ సింగ్ గారిని కూడా డిజిటల్ ఇండియా డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. ఆయన తన గ్రామంలో వెయ్యికి పైగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను ఏర్పాటు చేశారు. ఓం ప్రకాష్ గారు తన కామన్ సర్వీస్ సెంటర్ చుట్టూ ఉచిత వైఫై జోన్‌ను కూడా సృష్టించారు. ఇది అవసరమైన వారికి చాలా సహాయం చేస్తోంది. ఓం ప్రకాష్ గారి పని ఎంతగా పెరిగిపోయిందంటే ఆయన 20 మందికి పైగా తన దగ్గర పనిలో పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, తహసీల్ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించి ఉపాధి కూడా పొందుతున్నారు. కామన్ సర్వీస్ సెంటర్ లాగా, ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ అంటే GEM పోర్టల్‌లో ఇలాంటి విజయగాథలు ఎన్ని కనిపిస్తున్నాయి.
మిత్రులారా! నాకు గ్రామాల నుండి ఇలాంటి సందేశాలు చాలా వస్తుంటాయి. ఇంటర్నెట్ ద్వారా వచ్చిన మార్పులను ఆ సందేశాలు నాతో పంచుకుంటాయి. ఇంటర్నెట్ మన యువ స్నేహితులు చదువుకునే, నేర్చుకునే విధానాన్ని మార్చింది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్ కు చెందిన గుడియా సింగ్ ఉన్నావ్‌లోని అమోయియా గ్రామంలో ఉన్న తన అత్తమామల ఇంటికి వచ్చినప్పుడు ఆమె తన చదువు గురించి ఆందోళన చెందారు. అయితేభారత్ నెట్ ఆమె ఆందోళనను పరిష్కరించింది. గుడియా ఇంటర్నెట్ ద్వారా తన చదువును కొనసాగించారు. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. డిజిటల్ ఇండియా ప్రచారం ద్వారా గ్రామగ్రామానా ఇలాంటి జీవితాలెన్నో కొత్త శక్తిని పొందుతున్నాయి. మీరు గ్రామాల్లోని డిజిటల్ వ్యాపారవేత్తల గురించి మీకు వీలైనంత ఎక్కువగా రాయండి. వారి విజయగాథలను సోషల్ మీడియాలో కూడా పంచుకోండి.
నా ప్రియమైన దేశప్రజలారా!కొంతకాలం క్రితంహిమాచల్ ప్రదేశ్ కు చెందిన 'మన్ కీ బాత్' శ్రోత రమేశ్ గారి నుండి నాకు ఒక లేఖ వచ్చింది. రమేశ్ గారు తన లేఖలో పర్వతాల గొప్పతనాన్ని ప్రస్తావించారు. “పర్వతాల మీద నివాసాలు చాలా దూరం ఉండవచ్చు. కానీ ప్రజల హృదయాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయ”ని ఆయన రాశారు. నిజమే!పర్వతాలపై నివసించే ప్రజల జీవితాల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు.పర్వత ప్రాంతాల్లో ఉండేవారి జీవనశైలి, సంస్కృతి నుండి మనకు లభించే మొదటి పాఠం ఏమిటంటేమనం పరిస్థితుల ఒత్తిడికి లోనుకాకపోతే వాటిని సులభంగా అధిగమించవచ్చు. రెండవది-స్థానిక వనరులతో మనం ఎలా స్వయం సమృద్ధి చెందగలమో కూడా తెలుసుకోవచ్చు. నేను ప్రస్తావించిన మొదటి పాఠం, దాని అందమైన చిత్రం ఈ రోజుల్లో స్పీతీ ప్రాంతంలో కనిపిస్తుంది.స్పీతీ గిరిజన ప్రాంతం. ఇక్కడఈ రోజుల్లోబఠానీలు తీయడం జరుగుతుంది. కొండప్రాంత పొలాల్లో ఇది శ్రమతో కూడుకున్న పని. అయితే ఇక్కడ మాత్రం గ్రామంలోని మహిళలు ఉమ్మడిగా ఒకరికొకరు సహకరిస్తూ అందరి పొలాలలోంచి బఠానీలు కోస్తారు. ఈ పనితో పాటుమహిళలు 'ఛప్రా మాఝీ ఛప్రా' అనే స్థానిక పాటను కూడా పాడతారు.ఇక్కడ పరస్పర సహకారం కూడా జానపద సంప్రదాయంలో భాగమే. స్థానిక వనరుల వినియోగానికి కూడా ఉత్తమ ఉదాహరణ స్పీతీలో ఉంది. స్పీతీలో ఆవులను పెంచే రైతులు వాటి పేడను ఎండబెట్టి బస్తాల్లో నింపుతారు. శీతాకాలం వచ్చినప్పుడుఈ బస్తాలను ఆవు ఉండే ప్రదేశంలో వేస్తారు. ఈ ప్రదేశాన్ని ఇక్కడ ఖూడ్ అని పిలుస్తారు.హిమపాతం మధ్యఈ బస్తాలు చలి నుండి ఆవులకు రక్షణ కల్పిస్తాయి. చలికాలం తర్వాత ఈ ఆవు పేడను పొలాల్లో ఎరువుగా ఉపయోగిస్తారు. అంటేజంతువుల వ్యర్థాల నుండే వాటికి రక్షణ కల్పిస్తారు. వాటి నుండే పొలాలకు ఎరువు కూడా లభిస్తుంది. సాగు ఖర్చు కూడా తక్కువ. పొలంలో దిగుబడి కూడా ఎక్కువ. అందుకే ఈ రోజుల్లో ఈ ప్రాంతం సహజ వ్యవసాయానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది.
మిత్రులారా!మనమరొక కొండరాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో కూడా ఇటువంటి మెచ్చుకోదగిన అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో అనేక రకాల ఔషధాలు, వృక్షజాలం కనిపిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో ఒక పండు బేడు. దీన్నే హిమాలయన్ ఫిగ్లేదా హిమాలయన్ అంజీర్అని కూడా అంటారు.ఈ పండులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రజలు దీన్ని పండ్ల రూపంలోనే కాకుండాఅనేక వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఈ పండులోని ఈ గుణాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు బేడు రసం, జామ్‌లు, చట్నీలు, ఊరగాయలు, ఎండబెట్టి తయారు చేసిన డ్రై ఫ్రూట్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు.పితోర్‌ఘర్ పాలకవర్గం చొరవ, స్థానిక ప్రజల సహకారం కారణంగా బేడును వివిధ రూపాల్లో మార్కెట్‌లోకి తీసుకురావడంలో విజయం సాధించగలిగారు. బేడును పర్వత ప్రాంత అంజీర్ లేదా పహాడీ అంజీర్ గా బ్రాండ్ చేయడం ద్వారా ఆన్‌లైన్ మార్కెట్ కూడా మొదలైంది.దీని కారణంగారైతులకు కొత్త ఆదాయ వనరులు లభించడమే కాకుండాబేడుఔషధ గుణాల ప్రయోజనాలు సుదూరప్రాంతాలకు చేరుకోవడం ప్రారంభించాయి.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్' ప్రారంభంలో మనం స్వతంత్ర భారత అమృత మహోత్సవం గురించి మాట్లాడుకున్నాం. స్వాతంత్ర్య దినోత్సవం అనే గొప్ప పండుగతో పాటు రానున్న రోజుల్లో మరెన్నో పండుగలు రానున్నాయి. కొద్ది రోజుల తర్వాతగణేశుడిని పూజించే పండుగ గణేశ్ చతుర్థి వస్తోంది. గణేశ్ చతుర్థిఅంటే గణపతి బప్పా ఆశీస్సుల పండుగ.గణేశ్ చతుర్థికి ముందే ఓనం పండుగ కూడా ప్రారంభమవుతుంది. ఓనం ముఖ్యంగా కేరళలో శాంతి, సమృద్ధి అనే భావనలతో జరుపుకుంటారు. హర్తాళికా తీజ్ కూడా ఆగస్టు 30న వస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీన ఒడిశాలో నువాఖాయి పండుగను కూడా జరుపుకుంటారు. నువాఖాయి అంటే కొత్త ఆహారం. అంటే ఇది కూడా అనేక ఇతర పండుగల మాదిరిగానే మన వ్యవసాయ సంప్రదాయానికి సంబంధించిన పండుగ. వీటి మధ్య జైన సమాజం వారి సంవత్సరాది పండుగ కూడా ఉంటుంది. మన ఈ పండుగలన్నీ మన సాంస్కృతిక సమృద్ధికి, చైతన్యానికి మారుపేర్లు.ఈ పండుగలు, ప్రత్యేక విశేషాల సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ఈ పండుగలతో పాటు రేపు- ఆగస్టు 29వ తేదీన మేజర్ ధ్యాన్‌చంద్ గారి జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. ప్రపంచ వేదికలపై మన యువ ఆటగాళ్లు మన త్రివర్ణ పతాకం వైభవాన్ని కొనసాగించాలని కోరుకుందాం. ఇదే ధ్యాన్ చంద్ గారికి మన నివాళి. మనమందరం కలిసి దేశం కోసం ఇలాగే పని చేద్దాం. దేశ గౌరవాన్ని పెంచుదాం. ఈ కోరికతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. వచ్చే నెలలోమరోసారి 'మన్ కీ బాత్' ఉంటుంది. మీకు చాలా చాలా కృతజ్ఞతలు..
On the special occasion of Amrit Mahotsav and Independence Day, we have seen the collective might of the country. #MannKiBaat pic.twitter.com/pbJmkT4dKa
— PMO India (@PMOIndia) August 28, 2022
The celebration of Amrit Mahotsav were seen not only in India, but also in other countries of the world. #MannKiBaat pic.twitter.com/blq1kobV2m
— PMO India (@PMOIndia) August 28, 2022
PM @narendramodi urges everyone to watch 'Swaraj' serial on Doordarshan.
— PMO India (@PMOIndia) August 28, 2022
It is great initiative to acquaint the younger generation of the country with the efforts of unsung heroes who took part in the freedom movement. #MannKiBaat pic.twitter.com/3aaTxex3QZ
Construction of Amrit Sarovars has become a mass movement.
— PMO India (@PMOIndia) August 28, 2022
Commendable efforts can be seen across the country. #MannKiBaat pic.twitter.com/ERbFIMubhm
Efforts for social awareness play an important role in tackling the challenges of malnutrition.
— PMO India (@PMOIndia) August 28, 2022
I would urge all of you in the coming nutrition month, to take part in the efforts to eradicate malnutrition: PM during #MannKiBaat pic.twitter.com/UkJvqUlvQu
Today, millets are being categorised as a superfood.
— PMO India (@PMOIndia) August 28, 2022
A lot is being done to promote millets in the country.
Along with focusing on research and innovation related to this, FPOs are being encouraged, so that, production can be increased. #MannKiBaat pic.twitter.com/ASZ3X29oDW
Thanks to Digital India initiative, digital entrepreneurs are rising across the country. #MannKiBaat pic.twitter.com/JxFwmlD33C
— PMO India (@PMOIndia) August 28, 2022
Praiseworthy efforts from Himachal Pradesh and Uttarakhand. #MannKiBaat pic.twitter.com/UFjekFQeD7
— PMO India (@PMOIndia) August 28, 2022