మన్ కీ బాత్: దిగ్గజ మిల్కా సింగ్‌ను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు
భారతదేశం యొక్క టీకా కార్యక్రమం ప్రపంచానికి ఒక కేస్ స్టడీ కావచ్చు: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
జూన్ 21 న భారత్ 86 లక్షల మందికి టీకాలు వేసిన రికార్డు సృష్టించింది: ప్రధాని మోదీ
వర్షపునీటి సేకరణ భూగర్భజల పట్టికను మెరుగుపరుస్తుంది; అందువల్ల, నీటి సంరక్షణ అనేది దేశానికి చేసే సేవ: ప్రధాని మోదీ
కరోనా కాలంలో వైద్యులు చేసిన కృషికి మనమందరం కృతజ్ఞతలు. అందువల్ల, ఈసారి వైద్యుల దినోత్సవం మరింత ప్రత్యేకమైనది: ప్రధాని
ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో చార్టర్డ్ అకౌంటెంట్లకు భారీ పాత్ర ఉంది: ప్రధాని మోదీ
మన మంత్రం - ఇండియా ఫస్ట్ గా ఉండాలి: ప్రధాని మోదీ

నా ప్రియమైన దేశ వాసులారా! నమస్కారం. తరచుగా 'మన్ కి బాత్' మీరు కురిపించే ప్రశ్నలతో నిండిపోతుంది. ఈసారి మరో రకంగా 'మన్ కి బాత్' నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఈసారి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. నా ప్రశ్నలను శ్రద్ధగా వినండి.

.... ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు?

.... ఏ ఒలింపిక్ క్రీడలో భారతదేశం ఇప్పటివరకు అత్యధిక పతకాలు సాధించింది?

... ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారుడు ఎవరు?

మిత్రులారా! నాకు సమాధానాలు పంపినా పంపకపోయినా, మైగవ్‌లో ఒలింపిక్స్‌పై క్విజ్‌లోని ప్రశ్నలకు మీరు సమాధానం ఇస్తే, మీరు చాలా బహుమతులు గెలుచుకుంటారు. మైగవ్‌లోని 'రోడ్ టు టోక్యో క్విజ్'లో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. మీరు 'రోడ్ టు టోక్యో క్విజ్' లో పాల్గొనండి. ఇంతకు ముందు భారతదేశం ఎలాంటి సమర్థత చూపించింది? టోక్యో ఒలింపిక్స్ కోసం ఇప్పుడు మన సన్నాహాలు ఏమిటి? - ఇవన్నీ మీరే తెలుసుకోండి. ఇతరులకు కూడా చెప్పండి. ఈ క్విజ్ పోటీలో మీరు తప్పక పాల్గొనాలని మీ అందరినీ కోరుతున్నాను.

మిత్రులారా! టోక్యో ఒలింపిక్స్ విషయంపై మాట్లాడేటప్పుడు మిల్కా సింగ్ గారి లాంటి ప్రసిద్ధ అథ్లెట్‌ను ఎవరు మరచిపోగలరు! కొద్ది రోజుల క్రితమే కరోనా ఆయనను మన నుండి లాక్కుంది. ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం నాకు లభించింది.

1964 టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ఆయన ప్రాతినిధ్యం వహించిన విషయం ఆయనకు నేను గుర్తుచేశాను. ఈసారి మన క్రీడాకారులు ఒలింపిక్స్ కోసం టోక్యోకు వెళుతున్నప్పుడు మన అథ్లెట్ల ధైర్యాన్ని పెంచాలని, సందేశం అందించి వారిని ప్రేరేపించమని ఆయనతో మాట్లాడేటప్పుడు నేను కోరాను. ఆయనకు ఆటలపై చాలా అంకితభావం,మక్కువ ఉన్నాయి. అనారోగ్యంలో కూడా ఆయన వెంటనే దానికి అంగీకరించాడు. కానీ దురదృష్టవశాత్తు విధి మరో రకంగా తలచింది. ఆయన 2014 లో సూరత్ కు వచ్చారని నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము నైట్ మారథాన్‌ను ప్రారంభించాం. ఆ సమయంలో జరిగిన పిచ్చాపాటీ కబుర్లలో క్రీడల గురించి మాట్లాడటం వల్ల నేను కూడా చాలా ప్రేరణ పొందాను. భారతదేశానికి గర్వకారణంగా మిల్కా సింగ్ గారి కుటుంబం మొత్తం క్రీడలకు అంకితం అయిందని మనందరికీ తెలుసు.

మిత్రులారా! ప్రతిభ, అంకితభావం, సంకల్ప బలం, క్రీడా స్ఫూర్తి – ఇవన్నీ ఉన్నవారు ఛాంపియన్ అవుతారు. మన దేశంలో చాలా మంది ఆటగాళ్ళు చిన్న చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల నుండి వచ్చారు. టోక్యో క్రీడలకు వెళ్ళే చాలామంది క్రీడాకారుల జీవితం చాలా స్ఫూర్తినిస్తుంది. మీరు మన ప్రవీణ్ జాదవ్ గారి గురించి వింటే ఆయన చాలా కఠినమైన సంఘర్షణల ద్వారా ఇక్కడిదాకా చేరుకున్నారని కూడా మీరు తెలుసుకుంటారు. ప్రవీణ్ జాదవ్ గారు మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తున్నారు. అతను ఆర్చరీలో ఉత్తమ క్రీడాకారుడు. ఆయన తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషించడానికి కార్మికులుగా పనిచేస్తారు. ఇప్పుడు వారి కుమారుడు మొదటిసారి ఒలింపిక్స్ క్రీడలలో పాల్గొనేందుకు టోక్యోకు వెళ్తున్నాడు. ఇది అతని తల్లిదండ్రులు మాత్రమే కాదు. మనందరం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా నేహా గోయల్ అనే మరో క్రీడాకారిణి కూడా ఉన్నారు. టోక్యోకు వెళ్లే మహిళల హాకీ జట్టులో నేహా సభ్యురాలు. ఆమె తల్లి, సోదరీమణులు కుటుంబాన్ని పోషించడానికి సైకిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. నేహా మాదిరిగానే దీపికా కుమారి జీవితం కూడా ఒడిదుడుకులతో నిండి ఉంది. దీపిక తండ్రి ఆటో రిక్షా నడుపుతారు. ఆమె తల్లి ఒక నర్సు. ఇప్పుడు చూడండి- టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల ఆర్చరీ క్రీడలో భారతదేశం నుండి పాల్గొనే ఏకైక క్రీడాకారిణి దీపిక. ప్రపంచ నంబర్ వన్ ఆర్చర్ అయిన దీపికకు మనందరి శుభాకాంక్షలు.

మిత్రులారా! మనం జీవితంలో ఏ దశకు చేరుకున్నా, మనం ఎంత ఎత్తుకు చేరుకున్నా, భూమితో ఈ సంబంధం ఎల్లప్పుడూ మన మూలాలతో ముడిపడి ఉంటుంది. పోరాటం తర్వాత సాధించిన విజయంలోని ఆనందం ఎంతో ఉంటుంది. టోక్యోకు వెళ్ళే బృంద సభ్యులు బాల్యంలో అభ్యాసం చేయడంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఆటను వదులుకోలేదు. ఆటతో అనుసంధానం అయ్యే ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ప్రియాంక గోస్వామి గారి జీవితం కూడా చాలా నేర్పిస్తుంది. ప్రియాంక తండ్రి బస్సు కండక్టర్. పతక విజేతలు పొందే బ్యాగ్‌ను చిన్నతనంలో ప్రియాంక ఇష్టపడింది. ఈ ఆకర్షణలో ఆమె మొదటిసారి రేస్-వాకింగ్ పోటీలో పాల్గొన్నారు. ఇప్పుడు- ఈ రోజు ఆమె అందులో పెద్ద ఛాంపియన్.

జావెలిన్ త్రోలో పాల్గొంటున్న శివపాల్ సింగ్ గారు బనారస్ కు చెందినవారు. శివపాల్ గారి కుటుంబం మొత్తం ఈ ఆటతో ముడిపడి ఉంది. ఆయన తండ్రి, బాబాయి, సోదరుడు అందరూ జావెలిన్ త్రో లో నిపుణులు. కుటుంబ వారసత్వం టోక్యో ఒలింపిక్స్‌లో పని చేయబోతోంది. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్ళే చిరాగ్ శెట్టి, అతని భాగస్వామి సాత్విక్ సాయిరాజ్ ల ధైర్యం కూడా స్ఫూర్తిదాయకం. ఇటీవల చిరాగ్ తాతయ్య కరోనాతో మరణించారు. సాత్విక్ కూడా గత సంవత్సరం కరోనా పాజిటివ్ అయ్యారు. కానీ ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ వారిద్దరూ పురుషుల డబుల్ షటిల్ పోటీలో తమ ఉత్తమమైన ప్రతిభను ప్రదర్శించేందుకు సన్నద్ధమవుతున్నారు.

నేను మీకు మరొక క్రీడాకారుడిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన హర్యానాలోని భివానీకి చెందిన మనీష్ కౌశిక్ గారు. మనీష్ గారు ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు. చిన్నతనంలో పొలాలలో పనిచేస్తున్నప్పుడు మనీష్‌కు బాక్సింగ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఈ రోజు ఆ అభిరుచి ఆయనను టోక్యోకు తీసుకువెళుతోంది. మరొక క్రీడాకారిణి సి.ఎ. భవానీ దేవి. ఆమె పేరు భవాని.. ఆమె కత్తి పోరాటంలో నిపుణురాలు. చెన్నైకి చెందిన భవాని ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్. భవాని గారు శిక్షణ కొనసాగించేందుకు ఆమె తల్లి తన ఆభరణాలను కూడా తనఖా పెట్టిందని నేను ఎక్కడో చదివాను.

మిత్రులారా! అసంఖ్యాక పేర్లు ఉన్నాయి. కానీ మన్ కి బాత్ లో ఈ రోజు నేను కొన్ని పేర్లను మాత్రమే ప్రస్తావించగలిగాను. టోక్యోకు వెళ్లే ప్రతి క్రీడాకారుడి జీవితంలో దాని కోసం స్వంత పోరాటం ఉంది. ఇది చాలా సంవత్సరాల కృషి. వారు తమ కోసం మాత్రమే కాకుండా దేశం కోసం వెళుతున్నారు. ఈ ఆటగాళ్ళు భారతదేశ గౌరవాన్ని పెంచాలి. ప్రజల హృదయాలను కూడా గెలుచుకోవాలి. అందుకే నా దేశవాసులకు కూడా నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మనం ఈ ఆటగాళ్ళపై తెలిసిగానీ తెలియకుండా గానీ ఒత్తిడి చేయకూడదు. మంచి మనసుతో వారికి మద్దతు ఇవ్వండి. ప్రతి క్రీడాకారుడి ఉత్సాహాన్ని పెంచండి.

సోషల్ మీడియాలో హాష్ చీర్ 4 ఇండియాతో మీరు ఈ ఆటగాళ్లకు మీరు శుభాకాంశాలు తెలియజేయవచ్చు. మీరు మరింత వినూత్నమైన పని చేయాలనుకుంటే ఖచ్చితంగా అది కూడా చేయండి. మన ఆటగాళ్ల కోసం దేశం అంతా కలిసి ఏదైనా చేయాలనే ఆలోచన మీకు వస్తే మీరు ఖచ్చితంగా దాన్ని నాకు పంపండి. టోక్యోకు వెళ్లే మన ఆటగాళ్లకు మనందరం కలిసి మద్దతు తెలియజేద్దాం. చీర్ 4 ఇండియా !!! చీర్ 4 ఇండియా !!! చీర్ 4 ఇండియా !!!

నా ప్రియమైన దేశవాసులారా! కరోనాకు వ్యతిరేకంగా మన దేశవాసుల పోరాటం కొనసాగుతోంది. ఈ పోరాటంలో మనం చాలా అసాధారణమైన మైలురాళ్లను కూడా సాధిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం మన దేశం అపూర్వమైన పని చేసింది. టీకా కార్యక్రమంలోని తరువాతి దశ జూన్ 21 న ప్రారంభమైంది. అదే రోజున దేశం 86 లక్షల మందికి ఉచిత వ్యాక్సిన్ అందించిన రికార్డును సాధించింది. అది కూడా కేవలం ఒక్క రోజులో. భారత ప్రభుత్వం ద్వారా ఇంత పెద్ద సంఖ్యలో ఉచిత టీకాలు- అది కూడా కేవలం ఒక్క రోజులో! సహజంగానే ఇది చర్చనీయాంశమైంది.

 

మిత్రులారా! ఒక సంవత్సరం క్రితం అందరి ముందు టీకా ఎప్పుడు వస్తుందన్న ప్రశ్న ఉండేది. ఈ రోజు మనం ఒక్క రోజులో లక్షలాది మందికి ఉచితంగా 'మేడ్ ఇన్ ఇండియా' వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇది నవీన భారతదేశబలం.

మిత్రులారా! దేశంలోని ప్రతి పౌరుడు వ్యాక్సిన్ భద్రతను పొందాలి. ఈ విషయంలో మనం నిరంతర ప్రయత్నాలు చేయవలసి ఉంది. వాక్సిన్ వేసుకోవడం లో ఉన్న సంకోచాన్ని దూరం చేసేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయి. సమాజంలోని ప్రజలు కూడా ఈ విషయంలో ముందుకు వచ్చారు. అందరూ కలిసి చాలా మంచి పని చేస్తున్నారు. రండి.. ఈ రోజు కూడా ఒక గ్రామానికి వెళ్లి, టీకా గురించి అక్కడి వ్యక్తులతో మాట్లాడుదాం. మధ్యప్రదేశ్ లోని బైతూల్ జిల్లాలో ఉన్న డులారియా గ్రామానికి వెళ్దాం.

ప్రధానమంత్రి: హలో!

రాజేశ్: నమస్కారం సార్!

ప్రధాని: నమస్కారమండీ.

రాజేశ్: నా పేరు రాజేశ్ హిరావే. మాది భీంపూర్ బ్లాక్ లోని డులారియా గ్రామ పంచాయతీ సార్.

ప్రధానమంత్రి: రాజేశ్ గారూ.. మీ గ్రామంలో కరోనా పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని పిలిచాను.

రాజేశ్: సార్. ఇక్కడ కరోనా పెద్దగా ఏమీ లేదు సార్.

ప్రధానమంత్రి: ప్రస్తుతం ప్రజలు అనారోగ్యంతో లేరా?

రాజేశ్: అవును సార్.

ప్రధానమంత్రి: గ్రామ జనాభా ఎంత? గ్రామంలో ఎంత మంది ఉన్నారు?

రాజేశ్: గ్రామంలో 462 మంది పురుషులు, 332 మంది మహిళలు ఉన్నారు సార్.

ప్రధానమంత్రి: సరే! రాజేశ్ గారూ.. మీరు టీకా తీసుకున్నారా?

రాజేశ్: లేదు సార్. ఇంకా తీసుకోలేదు.

ప్రధానమంత్రి: ఓహ్! ఎందుకు తీసుకోలేదు?

రాజేశ్: సార్... ఇక్కడ కొంతమంది వాట్సాప్‌లో కొంత గందరగోళం కలిగించారు సార్. దాంతో ప్రజలు అయోమయంలో పడ్డారు సార్.

ప్రధానమంత్రి: కాబట్టి మీ మనసులో కూడా భయం ఉందా?

రాజేశ్: అవును సార్. ఇలాంటి పుకార్లు గ్రామమంతా వ్యాపించాయి సార్.

ప్రధానమంత్రి: అయ్యో.. టీకా విషయంలో గందరగోళం గురించా మీరు మాట్లాడేది! రాజేశ్ గారూ.. చూడండి ...

రాజేశ్: సార్.

ప్రధానమంత్రి: భయాన్ని తొలగించుకొమ్మని మీకు, మీ ఊరిలోని సోదర సోదరీమణులకు నేను చెప్తున్నాను.

రాజేశ్: సార్.

ప్రధానమంత్రి: మన దేశంలో 31 కోట్లకు పైగా ప్రజలు టీకా తీసుకున్నారు.

రాజేశ్: సార్

ప్రధానమంత్రి: మీకు తెలుసా! నేను కూడా రెండు డోసులు టీకా తీసుకున్నాను.

రాజేశ్: అవును సార్.

ప్రధానమంత్రి: మా అమ్మకు దాదాపు 100 సంవత్సరాలు. ఆమె కూడా రెండు డోసులు తీసుకుంది. కొన్నిసార్లు ఎవరికైనా జ్వరం లాంటివి వస్తాయి. కానీ అవి చాలా మామూలు. కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. టీకా తీసుకోకపోవడం చాలా ప్రమాదకరం.

రాజేశ్: అవును సార్.

ప్రధానమంత్రి: దీని ద్వారా మీకు మీరుగా ప్రమాదంలో పడటమే కాదు- మీ కుటుంబాన్ని, గ్రామాన్ని కూడా ప్రమాదంలో పడేయవచ్చు.

రాజేశ్: సార్.

ప్రధానమంత్రి: రాజేశ్ గారూ.. కాబట్టి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోండి. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ భారత ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ ఇస్తోందని, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ ఉచిత టీకా అని చెప్పండి.

రాజేశ్: సార్ .. సరే సార్.

ప్రధానమంత్రి: కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రామంలోని ప్రజలకు కూడా చెప్పాలి. గ్రామంలో ఈ భయ వాతావరణానికి కారణమే లేదు.

రాజేశ్: తప్పుడు పుకారును వ్యాప్తి చేయడం వల్ల ప్రజలు చాలా భయపడ్డారు సార్. టీకా వల్ల జ్వరం వస్తుందని, దాంతో వ్యాధి పెరిగి మరణానికి కూడా దారి తీస్తుందని పుకార్లు వచ్చాయి సార్.

ప్రధానమంత్రి: ఓహ్ ... ఈ రోజులలో రేడియో ఉంది, టీవీ ఉంది. వీటితో చాలా వార్తలు వస్తాయి. కాబట్టి ప్రజలకు వివరించడం చాలా సులభం అవుతుంది. చూడండి.. గ్రామంలోని అందరూ టీకాలు తీసుకున్న గ్రామాలు కూడా భారతదేశంలో చాలా ఉన్నాయి. అంటే గ్రామానికి చెందిన 100% మంది టీకాలు తీసుకున్న గ్రామాలు. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ...

రాజేశ్: సార్.

ప్రధానమంత్రి: కాశ్మీర్‌లో బాందీపుర జిల్లా ఉంది. ఈ జిల్లాలో వ్యవన్ అనే గ్రామ ప్రజలు 100% వ్యాక్సిన్‌ను లక్ష్యంగా చేసుకుని దాన్ని సాధించారు. ఈ కాశ్మీర్ గ్రామంలో ఉన్న 18 ఏళ్లు పైబడిన ప్రజలందరికీ టీకాలు వేశారు. నాగాలాండ్‌లోని మూడు గ్రామాలలో కూడా వంద శాతం టీకాలు వేసుకున్నారని నాకు తెలిసింది.

రాజేశ్: సార్ ...

ప్రధానమంత్రి: రాజేశ్ గారూ.. మీరు దీన్ని మీ గ్రామానికి, మీ చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియజేయాలి. మీరు చెప్పిన విషయం కేవలం ఒక భ్రమ. అవి పుకార్లు మాత్రమే.

రాజేశ్: అవును ...

ప్రధానమంత్రి: కాబట్టి గందరగోళానికి సమాధానం ఏమిటంటే మీరే స్వయంగా టీకాలు వేసుకుని అందరినీ ఒప్పించాలి. చేస్తారు కదా..!

రాజేశ్: సరే సార్.

ప్రధానమంత్రి: తప్పకుండా చేస్తారు కదా!

రాజేశ్: అవును సార్. అవును సార్. మీతో మాట్లాడటం వల్ల టీకా వేసుకుని, దాని గురించి ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నాను సార్.

ప్రధానమంత్రి: సరే. నాతో మాట్లాడేందుకు మీ గ్రామం నుండి ఇంకా ఎవరైనా ఉన్నారా?

రాజేశ్: అవును సార్.

ప్రధాని: ఎవరు మాట్లాడతారు?

కిశోరీలాల్: హలో సార్ ...నమస్కారం

ప్రధానమంత్రి: నమస్కారమండీ.. మీరు ఎవరు మాట్లాడుతున్నారు?

కిశోరీలాల్: సార్.. నా పేరు కిశోరీలాల్ దూర్వే.

ప్రధానమంత్రి: కిశోరీలాల్ గారూ.. నేను ఇప్పటివరకూ రాజేశ్ గారి తో మాట్లాడుతున్నాను.

కిశోరీలాల్: అవును సార్.

ప్రధానమంత్రి: ప్రజలు టీకాపై మరో రకంగా మాట్లాడుతున్నారని ఆయన చాలా బాధతో చెప్పారు.

కిశోరీలాల్: అవును సార్

ప్రధానమంత్రి: మీరు కూడా ఇలాంటివి విన్నారా?

కిశోరీలాల్: అవును సార్ ... నేను విన్నాను సార్ ...

ప్రధానమంత్రి: మీరేం విన్నారు?

కిశోరీలాల్: సమీపంలోని మహారాష్ట్రలో బంధువులున్న కొందరు- అక్కడి ప్రజలు వ్యాక్సిన్ వేయడం ద్వారా చనిపోతున్నారని పుకార్లు వ్యాపింపజేశారు సార్. కొందరు చనిపోతున్నారని, కొందరు అనారోగ్యానికి గురవుతున్నారని పుకార్లు లేపారు సార్. ప్రజలలో ఎక్కువ గందరగోళం ఉంది కాబట్టి తీసుకోవడం లేదు సార్.

ప్రధానమంత్రి: లేదు .. అసలు వాళ్ళేమంటారు? ఇప్పుడు కరోనా పోయిందని అంటున్నారా?

కిశోరీలాల్: అవును సార్.

ప్రధానమంత్రి: కరోనాతో ఏమీ కాదని చెప్తున్నారా?

కిశోరీలాల్: లేదు సార్. కరోనా పోయిందని చెప్పడం లేదు. కరోనా ఉంది కానీ టీకా తీసుకోవడం వల్ల జబ్బు పడుతున్నారని, అందరూ చనిపోతున్నారని చెప్తున్నారు సార్.

ప్రధానమంత్రి: అయితే టీకా కారణంగా చనిపోతున్నారని చెప్తున్నారా?

కిశోరీలాల్: మాది ఆదివాసీ ప్రాంతం సార్. వాళ్లు చాలా త్వరగా భయపడతారు. .. పుకార్లు వ్యాప్తి చెందుతున్నందువల్ల ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడం లేదు సార్.

ప్రధానమంత్రి: కిశోరీలాల్ గారూ.. చూడండి ...

కిశోరీలాల్: సార్ ...

ప్రధాని: ఈ పుకార్లను వ్యాప్తి చేసే వాళ్ళు పుకార్లు కల్పిస్తూనే ఉంటారు.

కిశోరీలాల్: అవును సార్.

ప్రధానమంత్రి: మనం ప్రాణాలను కాపాడుకోవాలి. మన గ్రామస్తులను కాపాడాలి. మన దేశవాసులను కాపాడాలి. కరోనా పోయిందని ఎవరైనా చెబితే ఆ భ్రమలో ఉండకండి.

కిశోరీలాల్: సార్.

ప్రధానమంత్రి: ఈ వ్యాధి రూపం మార్చుకుంటూ ఉంటుంది.

కిశోరీలాల్: అవును సార్.

ప్రధానమంత్రి: ఇది రూపం మారుతుంది. కొత్త రూపాలు తీసుకున్న తర్వాత అది ప్రజలను చేరుకుంటుంది.

కిశోరీలాల్: అవును సార్.

ప్రధానమంత్రి: దాని నుండి తప్పించుకోవడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కరోనా కోసం తయారుచేసిన ప్రోటోకాల్- మాస్క్ ధరించడం, సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం, దూరాన్ని పాటించడం. మరొక మార్గం దాంతో పాటు టీకాలు వేయడం. అది కూడా మంచి రక్షణ కవచం. దాని గురించి ఆలోచించండి.

కిశోరీలాల్: సార్

ప్రధానమంత్రి: సరే.. కిశోరీలాల్ గారూ.. ఈ విషయం చెప్పండి.

కిశోరీలాల్: సార్

ప్రధానమంత్రి: ప్రజలు మీతో మాట్లాడేటప్పుడు మీరు ప్రజలకు ఈ విషయాన్ని ఎలా వివరిస్తారు? లేదా మీరు కూడా పుకార్ల మాయలో పడిపోతారా?

కిశోరీలాల్: వివరించడం కాదు సార్.. ఆ వ్యక్తులు ఎక్కువైతే, మనం కూడా భయపడిపోతాం కదా సార్.

ప్రధానమంత్రి: చూడండి.. కిశోరీలాల్ గారూ.. నేను ఈ రోజు మీతో మాట్లాడాను. మీరు నా స్నేహితులు.

కిశోరీలాల్: సార్

ప్రధానమంత్రి: మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రజల భయాన్ని తొలగించాలి. మీరు దాన్ని తొలగిస్తారా?

కిశోరీలాల్: అవును సార్. సార్.. మేం ప్రజల భయాన్ని తొలగిస్తాం సార్. నేనే స్వయంగా ఆ పని చేస్తాను.

ప్రధానమంత్రి: చూడండి.. పుకార్లను పట్టించుకోవద్దు.

కిశోరీలాల్: సార్

ప్రధానమంత్రి: మీకు తెలుసా.. ఈ టీకా తయారీ కోసం మన శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు.

కిశోరీలాల్: అవును సార్.

ప్రధానమంత్రి: సంవత్సరమంతా రాత్రి , పగలు చాలా మంది గొప్ప శాస్త్రవేత్తలు పనిచేశారు. అందుకే మనం సైన్స్ ను విశ్వసించాలి. శాస్త్రవేత్తలను నమ్మాలి. ఈ అబద్ధాలను వ్యాప్తి చేసే వ్యక్తులకు మళ్లీ మళ్లీ వివరించాలి. ఇంత మంది టీకా తీసుకున్నారు.. ఏమీ జరగదని వారికి చెప్పాలి.

కిశోరీలాల్: సరే సార్

ప్రధానమంత్రి: పుకార్ల నుండి సురక్షితంగా ఉండాలి. గ్రామాన్ని కూడా రక్షించాలి.

కిశోరీలాల్: అవును సార్

ప్రధానమంత్రి: రాజేశ్ గారు, కిశోరీ లాల్ గారు.. మీలాంటి నా మిత్రులు కేవలం మీ స్వంత గ్రామంలో మాత్రమే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా ఈ పుకార్లను ఆపడానికి, నేను మాట్లాడిన విషయాన్ని ప్రజలకు చెప్పడానికి పని చేయాలి.

కిశోరీలాల్: సరే సార్.

ప్రధానమంత్రి: చెప్పండి.. నా పేరు చెప్పండి.

కిశోరీలాల్: చెప్తాం సార్. ప్రజలకు అర్థం చేయిస్తాం సార్. నేను కూడా టీకా తీసుకుంటాను సార్.

ప్రధానమంత్రి: చూడండ.. మీ గ్రామానికి నా శుభాకాంక్షలు.

కిశోరీలాల్: సార్.

ప్రధానమంత్రి: తప్పకుండా టీకా తీసుకొమ్మని అందరికీ చెప్పండి ...

కిశోరీలాల్: సార్ ...

ప్రధానమంత్రి: ఖచ్చితంగా టీకా తీసుకోండి.

కిశోరీలాల్: సరే సార్.

ప్రధానమంత్రి: గ్రామంలోని మహిళలను, మన తల్లులను, సోదరీమణులను ఈ పనిలో అనుసంధానింపజేయండి.

కిశోరీలాల్: సార్

ప్రధానమంత్రి: వారిని మీతో పాటు చురుకుగా ఉంచండి.

కిశోరీలాల్: సరే సార్

ప్రధానమంత్రి: కొన్నిసార్లు తల్లులు, సోదరీమణులు చెప్పే విషయాలను ప్రజలు త్వరగా అంగీకరిస్తారు.

కిశోరీలాల్: అవును సార్

ప్రధానమంత్రి: మీ గ్రామంలో టీకాలు వేయడం పూర్తయినప్పుడు మీరు నాకు చెప్తారా?

కిశోరీలాల్: అవును సార్. చెప్తాం సార్.

ప్రధాని: తప్పకుండా చెప్తారా?

కిశోరీలాల్: అవును సార్

ప్రధానమంత్రి: చూడండి.. నేను మీ లేఖ కోసం వేచి ఉంటాను.

కిశోరీలాల్: సరే సార్

ప్రధానమంత్రి: రాజేశ్ గారు, కిశోర్ గారు.. చాలా ధన్యవాదాలు. మీతో మాట్లాడే అవకాశం వచ్చింది

కిశోరీలాల్: ధన్యవాదాలు సార్. మీరు మాతో మాట్లాడారు. మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్.

మిత్రులారా! భారత దేశంలోని వివిధ గ్రామాల ప్రజలు- మన ఆదివాసీ గిరిజన సోదర సోదరీమణులు ఈ కరోనా కాలంలో తమ శక్తిని, అవగాహనను ఎలా చూపించారనే విషయం ప్రపంచానికి ఒక అధ్యయనాంశం అవుతుంది. గ్రామాల ప్రజలు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ ప్రోటోకాల్‌ను తయారు చేశారు. గ్రామ ప్రజలు - ఎవరినీ ఆకలితో నిద్రపోనివ్వలేదు. వ్యవసాయ పనులను కూడా ఆపలేదు. సమీప నగరాలకు పాలు, కూరగాయలు- ఇవన్నీ రోజూ చేరుకుంటూనే ఉన్నాయి. ఈ విధంగా గ్రామాలు తమను తాము చూసుకోవడంతో పాటు ఇతరులను కూడా చూసుకున్నాయి. అదేవిధంగా టీకా ప్రచారంలో కూడా మనం అదే చేస్తూనే ఉండాలి. మనకు అవగాహన ఉండాలి. ఇతరులకు అవగాహన కల్పించాలి. గ్రామాల్లోని ప్రతి వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోవాలి. అది ప్రతి గ్రామ లక్ష్యం. గుర్తుంచుకోండి- నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ మనస్సులో మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ప్రతి ఒక్కరూ విజయవంతం కావాలని కోరుకుంటారు. కానీ నిర్ణయాత్మక విజయ మంత్రం ఏమిటి? నిర్ణయాత్మక విజయ మంత్రం – నిరంతరత. అందువల్ల, మనం మందగించకూడదు. ఏ భ్రమల్లోనూ జీవించవద్దు. మనం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. కరోనాపై గెలవాలి.

నా ప్రియమైన దేశవాసులారా! ఇప్పుడు రుతుపవనాలు కూడా మన దేశానికి వచ్చాయి. మేఘాలు వర్షం కురిపించినప్పుడు అవి కేవలం మనకోసం మాత్రమే వర్షం కురిపించవు. రాబోయే తరాల కోసం కూడా మేఘాలు వర్షిస్తాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకడంతో పాటు భూమిపై ఉండే నీటి స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. అందుకే నీటి సంరక్షణను దేశానికి చేసే సేవగా నేను భావిస్తున్నాను. మీరు కూడా చూసి ఉంటారు- మనలో చాలా మంది ఈ పనిని బాధ్యతగా తీసుకుంటున్నారు. అలాంటివారిలో ఒకరు ఉత్తరాఖండ్‌లోని పౌడి గఢ్వాల్ కు చెందిన సచ్చిదానంద్ భారతి గారు. ఆయన ఒక ఉపాధ్యాయుడు. ఆయన తన రచనల ద్వారా ప్రజలకు చాలా మంచి విద్యను అందించారు. ఈ రోజు ఆయన కృషి కారణంగా పౌడి గఢ్వాల్ లోని ఉఫ్రెయిన్ ఖాల్ ప్రాంతంలో పెద్ద నీటి సంక్షోభం ముగిసింది. ఒకప్పుడు ప్రజలు నీటి కోసం ఆరాటపడిన చోట నేడు ఏడాది పొడవునా నీటి సరఫరా ఉంది.

మిత్రులారా! పర్వతాలలో నీటి సంరక్షణకు ఒక సాంప్రదాయిక పద్ధతి ఉంది, దీనిని చాల్ ఖాల్’ అని అంటారు అంటే నీటిని నిల్వ చేయడానికి ఒక పెద్ద గొయ్యిని తవ్వదన్నమాట. భారతి గారు కొన్ని కొత్త పద్ధతులను కూడా జోడించారు. ఆయన కొన్ని పెద్ద, చిన్న చెరువులను నిర్మించారు. వీటి వల్ల ఉఫ్రయింఖాల్ కొండలు పచ్చగా మారడమే కాకుండా ప్రజల తాగునీటి సమస్య కూడా పోయింది. భారతి గారు ఇలాంటి 30 వేలకు పైగా నీటి వనరులను నిర్మించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 30 వేలు! ఆయన భగీరథ ప్రయత్నం నేటికీ కొనసాగుతూనే ఉంది. అది చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.

మిత్రులారా! అదేవిధంగా యూపీలోని బాందా జిల్లాలో ఉన్న అంధావ్ గ్రామ ప్రజలు కూడా భిన్నమైన ప్రయత్నం చేశారు. వారు తమ ఉద్యమానికి చాలా ఆసక్తికరమైన పేరు పెట్టారు. ఆ పేరు 'ఖేత్ కా పానీ ఖేత్ మే, గావ్ కా పానీ గావ్ మే'. అంటే ‘పొలం నీళ్ళు పొలం లోనే, ఊరి నీళ్ళు ఊరిలోనే’ అని. ఈ ఉద్యమం కింద గ్రామంలోని అనేక వందల ఎకరాల విస్తీర్ణంలోని పొలాలలో ఎత్తైన కట్టలను నిర్మించారు. ఈ కారణంగా వర్షపు నీరు పొలంలో సేకరణ ప్రారంభమై భూమిలోకి వెళ్ళడం మొదలైంది. ఇప్పుడు ఈ ప్రజలందరూ పొలాల కట్టలపై చెట్లను నాటాలని ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు రైతులకు నీరు, చెట్లు, డబ్బు- మూడూ లభిస్తాయి. వారి మంచి పనుల ద్వారా ఆ గ్రామానికి సుదూర ప్రాంతాల్లో కూడా గుర్తింపు లభించింది.

మిత్రులారా! వీటన్నిటి నుండి ప్రేరణ పొంది మన చుట్టూ ఉన్న నీటిని ఏ విధంగానైనా ఆదా చేసుకోగలగాలి. నీటిని మనం కాపాడుకోవాలి. ఈ ముఖ్యమైన రుతుపవన సమయాన్ని మనం కోల్పోవలసిన అవసరం లేదు.

 

నా ప్రియమైన దేశ వాసులారా! మన గ్రంథాలలో ఇలా చెప్పారు.

"నాస్తి మూలం అనౌషధం" ||

అంటే ఔషధ గుణాలు లేని మొక్క భూమిపై లేదని అర్థం! మన చుట్టూ ఇలాంటి చెట్లు, మొక్కలు చాలా ఉన్నాయి. వీటిలో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. కానీ చాలా సార్లు వాటి గురించి కూడా మనకు తెలియదు! నైనిటాల్‌కు చెందిన పరితోష్ అనే మిత్రుడు ఇదే విషయంపై నాకు లేఖ పంపారు. కరోనా వచ్చిన తరువాత మాత్రమే గిలోయ్, అనేక ఇతర మొక్కల అద్భుతమైన వైద్య లక్షణాల గురించి తాను తెలుసుకున్నట్టు ఆయన రాశారు. 'మన్ కీ బాత్' శ్రోతలందరూ మీ చుట్టూ ఉన్న వృక్షసంపద గురించి తెలుసుకోవాలని పరితోష్ సూచించారు. వారంతా ఇతరులకు కూడా చెప్పవలసిందిగా ఆయన కోరారు. నిజానికి ఇది మన పురాతన వారసత్వం, మనం దీన్ని ఎంతో ఆదరించాలి. ఈ దిశలో మధ్యప్రదేశ్‌కు చెందిన సత్నాకు చెందిన రామ్‌లోటన్ కుష్వాహా గారు చాలా ప్రశంసనీయమైన పని చేశారు. రామ్‌లోటన్ గారు తన పొలంలో దేశీయ ప్రదర్శనశాలను నిర్మించారు. ఈ మ్యూజియంలో ఆయన వందలాది ఔషధ మొక్కలను, విత్తనాలను సేకరించి, భద్రపర్చారు. వాటిని చాలా దూరం నుండి ఇక్కడికి తీసుకువచ్చారు. ఇవి కాకుండా వారు ప్రతి సంవత్సరం అనేక రకాల కూరగాయలను కూడా పండిస్తారు. ఈ దేశీయ మ్యూజియమైన రామ్‌లోటన్ గారి తోటను సందర్శించేందుకు ప్రజలు వస్తారు. దాని నుండి చాలా నేర్చుకుంటారు. నిజమే! ఇది చాలా మంచి ప్రయోగం. ఇది దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిబింబిస్తుంది. మీలో అలాంటి ప్రయత్నం చేయగల వారిని నేను కోరుకుంటున్నాను. దీన్ని చేయండి. ఇది మీ కోసం కొత్త ఆదాయ వనరులను కూడా తెరుస్తుంది. స్థానిక వృక్షజాలం ద్వారా మీ ప్రాంత గుర్తింపు కూడా పెరుగుతుంది.

నా ప్రియమైన దేశవాసులారా! ఇప్పటి నుండి కొన్ని రోజుల తర్వాత జూలై 1వ తేదీన మనం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. దేశంలోని గొప్ప వైద్యుడు, రాజనీతిజ్ఞుడు డాక్టర్ బిసి రాయ్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవం జరుగుతుంది. కరోనా కాలంలో వైద్యులు చేసిన కృషికి మనమందరం కృతజ్ఞులం. వైద్యులు వారి జీవితాలను పట్టించుకోకుండా మనకు సేవ చేశారు. కాబట్టి ఈసారి జాతీయ వైద్యుల దినోత్సవం మరింత ప్రత్యేకమైంది.

మిత్రులారా! ఔషధ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన హిప్పోక్రేట్స్ ఇలా అన్నారు:

"వైద్య కళను ప్రేమించే చోట మానవత్వాన్ని కూడా ప్రేమిస్తారు” అని.

ఈ ప్రేమ శక్తితో మాత్రమే వైద్యులు మనకు సేవ చేయగలుగుతారు. అందువల్ల వారికి సమాన ప్రేమతో కృతజ్ఞతలు చెప్పడం, ప్రోత్సహించడం మన కర్తవ్యం. మరింత ముందుకు వెళ్ళి వైద్యులకు సహాయం చేసేవారు కూడా మన దేశంలో చాలా మంది ఉన్నారు. శ్రీనగర్ నుండి అలాంటి ఒక ప్రయత్నం గురించి నాకు తెలిసింది. అక్కడి దాల్ సరస్సులో బోట్ అంబులెన్స్ సేవను ప్రారంభించారు. ఈ సేవను హౌస్‌బోట్ యజమాని అయిన శ్రీనగర్‌కు చెందిన తారిక్ అహ్మద్ పట్లూ గారు ప్రారంభించారు. ఆయన కూడా స్వయంగా కోవిడ్-19 తో యుద్ధం చేశారు. ఇది అంబులెన్స్ సేవను ప్రారంభించడానికి ఆయనకు ప్రేరణనిచ్చింది. ఈ అంబులెన్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. వారు కూడా అంబులెన్స్ నుండి నిరంతరం ప్రకటనలు చేస్తున్నారు. మాస్క్ ధరించడంతో పాటు ఇతర విషయాలలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

మిత్రులారా! డాక్టర్ల దినోత్సవంతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవాన్ని కూడా జూలై 1 న జరుపుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రపంచ స్థాయి భారతీయ ఆడిట్ సంస్థల నుండి బహుమతుల కోసం దేశంలోని చార్టర్డ్ అకౌంటెంట్లను ప్రతిపాదనలు అడిగాను. ఈ రోజు నేను ఈ విషయాన్ని వారికి గుర్తు చేయాలనుకుంటున్నాను. చార్టర్డ్ అకౌంటెంట్లు ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో చాలా మంచి, సానుకూల పాత్ర పోషిస్తారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ కు, వారి కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు.

నా ప్రియమైన దేశ వాసులారా! కరోనాపై భారతదేశం చేసిన పోరాటంలో గొప్ప లక్షణం ఉంది. ఈ పోరాటంలో దేశంలోని ప్రతి వ్యక్తి తన వంతు పాత్ర పోషించారు. నేను దీనిని "మన్ కి బాత్" లో తరచుగా ప్రస్తావించాను. కానీ కొంతమంది తమ గురించి ఎక్కువగా మాట్లాడలేదని ఫిర్యాదు చేస్తారు. చాలా మంది ఈ పోరాటం చేసిన వారిజాబితాలో ఉన్నారు. బ్యాంక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, చిన్న వ్యాపారులు, దుకాణదారులు, దుకాణాలలో పనిచేసే వ్యక్తులు, వీధి వ్యాపారులు, సెక్యూరిటీ వాచ్‌మెన్లు ,పోస్ట్‌మెన్, పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు - వాస్తవానికి ఈ జాబితా చాలా పెద్దది. చాలా కాలం ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. పరిపాలనలో కూడా వివిధ స్థాయిలలో ఎంతో మంది పాల్గొన్నారు.

మిత్రులారా! భారత ప్రభుత్వంలో కార్యదర్శిగా ఉన్న గురు ప్రసాద్ మహా పాత్ర గారి పేరు మీరు బహుశా విని ఉంటారు. ఈ రోజు ‘మన్ కి బాత్’ లో నేను ఆయన విషయం కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. గురుప్రసాద్ గారికి కరోనా వచ్చింది. ఆయన ఆసుపత్రిలో చేరారు. తన విధులను కూడా నిర్వహించారు. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి, సుదూర ప్రాంతాలకు ఆక్సిజన్ చేరుకోవడానికి ఆయన పగలు, రాత్రి పనిచేశారు. ఒక వైపు కోర్టు వ్యవహారాలు, మీడియా ఒత్తిడి – ఇలా ఆయన ఒకేసారి అనేక రంగాల్లో పోరాడుతూనే ఉన్నారు. అనారోగ్య సమయంలో కూడా ఆయన పనిచేయడం ఆపలేదు. వద్దని చెప్పిన తర్వాత కూడా ఆయన మొండిగా ఆక్సిజన్‌పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేవారు. దేశవసూలు కూడా ఆయన గురించి చాలా ఆందోళన చెందారు. ఆసుపత్రి మంచం మీద తన గురించి ఆలోచించకుండా దేశ ప్రజలకు ఆక్సిజన్ సరఫరా చేసే ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. దేశం ఈ కర్మ యోగిని కోల్పోవడం మనందరికీ విచారకరం. కరోనా ఆయనను మన నుండి లాక్కుంది. చర్చలోకి కూడా రాని అనేకమంది ఉన్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను పూర్తిగా అనుసరించడం, వ్యాక్సిన్‌ను ఖచ్చితంగా తీసుకోవడమే అలాంటి ప్రతి వ్యక్తికి మనమిచ్చే నివాళి.

నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్' గొప్పదనం ఏమిటంటే, మీరందరూ ఇందులో నాకన్నా ఎక్కువ సహకారం అందించడం. ఇప్పుడే నేను మైగవ్‌లో ఒక పోస్ట్ చూశాను. చెన్నైకి చెందిన ఆర్.గురుప్రసాద్ గారు రాసిన విషయం తెలుసుకోవడం మీకూ సంతోషంగా ఉంటుంది. తాను ‘మన్ కి బాత్’ కార్యక్రమాన్ని రెగ్యులర్ శ్రోతను అని ఆయన రాశారు. ఇప్పుడు నేను గురుప్రసాద్ గారి పోస్ట్ నుండి కొన్ని పంక్తులను ఉటంకిస్తున్నాను.

“మీరు తమిళనాడు గురించి మాట్లాడినప్పుడల్లా నా ఆసక్తి మరింత పెరుగుతుంది. తమిళ భాష , తమిళ సంస్కృతి గొప్పతనం, తమిళ పండుగలు, తమిళనాడులోని ప్రధాన ప్రదేశాల గురించి మీరు చర్చించారు.” అని ఆయన రాశారు.

గురు ప్రసాద్ గారు ఇంకా ఇలా రాశారు. “మన్ కి బాత్” లో తమిళనాడు ప్రజల విజయాల గురించి కూడా చాలాసార్లు చెప్పారు. తిరుక్కురళ్ పై మీకున్న ప్రేమ గురించి, తిరువళ్లువార్ గారి పట్ల మీకున్న గౌరవం గురించి ఏమి చెప్పాలి! అందుకే మీరు తమిళనాడు గురించి మాట్లాడినవన్నీ 'మన్ కి బాత్' లో సంకలనం చేసి ఈ-బుక్ సిద్ధం చేశాను. మీరు ఈ ఇ-బుక్ గురించి ఏదైనా చెప్పి, దానిని నామోఆప్‌లో కూడా విడుదల చేస్తారా? ధన్యవాదాలు” .

గురుప్రసాద్ గారి ఈ లేఖను మీ ముందు చదువుతున్నాను.

గురుప్రసాద్ గారూ.. మీ ఈ పోస్ట్ చదివినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ ఇ-బుక్‌కు మరో పేజీని జోడించండి.

.. 'నాన్ తమిళకలా చారాక్తిన్ పెరియే అభిమాని!

నాన్ ఉల్గాత్ లయే పాల్ మాయా తమిళ మొలియన్ పెరియే అభిమాని!!'

ఖచ్చితంగా ఉచ్చారణ దోషాలు ఉంటాయి. కానీ నా ప్రయత్నం, నా ప్రేమ ఎప్పటికీ తగ్గవు. నేను తమిళం మాట్లాడని వారికి చెప్పాలనుకుంటున్నాను, నేను గురుప్రసాద్ గారికి చెప్పాను – “నేను తమిళ సంస్కృతికి పెద్ద అభిమానిని. నేను ప్రపంచంలోని అన్నింటికంటే ప్రాచీన భాష అయిన తమిళానికి పెద్ద అభిమానిని.” అని.

మిత్రులారా! ప్రపంచంలోని అత్యంత ప్రాచీన భాష మన దేశానికి చెందినది అయినందుకు ప్రతి భారతీయుడు గర్వించాలి. దాన్ని ప్రశంసించాలి. నేను కూడా తమిళం విషయంలో చాలా గర్వపడుతున్నాను. గురు ప్రసాద్ గారూ.. మీ ఈ ప్రయత్నం నాకు కొత్త దృష్టిని ఇవ్వబోతోంది. ఎందుకంటే నేను 'మన్ కి బాత్' చేసేటప్పుడు విషయాలను సహజంగా, సరళంగా ఉండేలా చూస్తాను. ఇది కూడా ఒక లక్షణం అని నాకు తెలియదు. మీరు పాత విషయాలన్నీ సేకరించినప్పుడు నేను కూడా ఒకసారి కాదు రెండుసార్లు చదివాను. గురుప్రసాద్ గారూ.. నేను ఖచ్చితంగా మీ ఈ పుస్తకాన్ని నమోయాప్‌లో అప్‌లోడ్ చేస్తాను. భవిష్యత్ ప్రయత్నాలకు మీకు శుభాకాంక్షలు.

నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం కరోనా ఇబ్బందులు , జాగ్రత్తల గురించి మాట్లాడాం. దేశం, దేశస్థుల అనేక విజయాల గురించి కూడా చర్చించాం. ఇప్పుడు మరో ముఖ్యమైన సందర్భం కూడా మన ముందు ఉంది. ఆగస్టు 15 కూడా వస్తోంది. 75 సంవత్సరాల అమృత మహోత్సవం- ఈ పండుగ మనకు పెద్ద ప్రేరణ. దేశం కోసం జీవించడం నేర్చుకుందాం. స్వాతంత్ర్య సమరం దేశం కోసం మరణించిన వారి కథ. ఈ స్వాతంత్య్రానంతర సమయాన్ని మనం దేశం కోసం జీవించే వారి కథగా చేసుకోవాలి. మన మంత్రం ‘ఇండియా ఫస్ట్’ అని ఉండాలి. మన ప్రతి నిర్ణయానికి ఒక ఆధారం ఉండాలి అదే- ఇండియా ఫస్ట్.

మిత్రులారా! అమృత మహోత్సవంలో దేశం కూడా అనేక సామూహిక లక్ష్యాలను నిర్దేశించింది. అలాగే మన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుంచుకోవాలి. వారితో సంబంధం ఉన్న చరిత్రను పునరుద్ధరించాలి. స్వాతంత్య్ర సమర చరిత్ర రాయాలని, పరిశోధన చేయాలని 'మన్ కి బాత్' లో నేను యువతను కోరిన విషయం మీకు గుర్తు ఉండి ఉంటుంది. యువ ప్రతిభ ముందుకు రావాలి. యువత-ఆలోచన, యువత-అభిప్రాయాలు ముందుకు రావాలి. యువత కొత్త శక్తితో రాయాలి. చాలా తక్కువ సమయంలో ఈ పని చేయడానికి రెండున్నర వేలకు పైగా యువత ముందుకు వచ్చారు. మిత్రులారా! ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 19 వ - 20 వ శతాబ్దాల యుద్ధం గురించి సాధారణంగా మాట్లాడుతారు. కాని 21 వ శతాబ్దంలో జన్మించిన యువ మిత్రులు 19, 20 వ శతాబ్దపు స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రజల ముందు ఉంచడానికి ముందుకు వచ్చారు. మైగవ్‌లో తమ పూర్తి వివరాలను పంపారు. వారు హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, బంగ్లా, తెలుగు, మరాఠీ, మలయాళం, గుజరాతీ మొదలైన దేశంలోని వివిధ భాషలలో స్వాతంత్య్ర సంగ్రామం గురించి రాస్తారు. స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం కలిగి ఉండే తమ సమీప ప్రదేశాల గురించి సమాచారాన్ని కొందరు సేకరిస్తారు. కొందరు గిరిజన స్వాతంత్ర్య సమరయోధులపై పుస్తకం రాస్తున్నారు. మంచి ప్రారంభం. మీరందరూ మీకు వీలైనంతవరకు అమృత్ మహోత్సవ్‌లో చేరాలని నేను కోరుతున్నాను. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలకు మనం సాక్షులమవ్వడం మన అదృష్టం.

కాబట్టి తర్వాతిసారి మనం 'మన్ కి బాత్'లో కలుసుకున్నప్పుడు అమృత్-మహోత్సవ్ గురించి, ఆ కార్యక్రమ సన్నాహాల గురించి మాట్లాడుకుందాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి. కరోనాకు సంబంధించిన నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి. మీ కొత్త ప్రయత్నాలతో దేశాన్ని కూడా ప్రగతిశీలంగా ఉంచండి. ఈ శుభాకాంక్షలతో చాలా చాలా ధన్యవాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets with Crown Prince of Kuwait
December 22, 2024

​Prime Minister Shri Narendra Modi met today with His Highness Sheikh Sabah Al-Khaled Al-Hamad Al-Mubarak Al-Sabah, Crown Prince of the State of Kuwait. Prime Minister fondly recalled his recent meeting with His Highness the Crown Prince on the margins of the UNGA session in September 2024.

Prime Minister conveyed that India attaches utmost importance to its bilateral relations with Kuwait. The leaders acknowledged that bilateral relations were progressing well and welcomed their elevation to a Strategic Partnership. They emphasized on close coordination between both sides in the UN and other multilateral fora. Prime Minister expressed confidence that India-GCC relations will be further strengthened under the Presidency of Kuwait.

⁠Prime Minister invited His Highness the Crown Prince of Kuwait to visit India at a mutually convenient date.

His Highness the Crown Prince of Kuwait hosted a banquet in honour of Prime Minister.