బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో ‘‘ప్రపంచ వైశాఖీ వేడుకల’’ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా కీలక ప్రసంగం చేశారు. అత్యంత పూజనీయులైన ‘మహాసంఘ’ సభ్యులతోపాటు నేపాల్, శ్రీలంక దేశాల ప్రధాన మంత్రులు, కేంద్ర మంత్రిమండలి సభ్యులు శ్రీ ప్రహ్లాద్ సింగ్, శ్రీ కిరణ్ రెజిజు, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ప్రధాన కార్యదర్శి-గౌరవనీయ డాక్టర్ ధమ్మపియా తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ఇది బుద్ధభగవానుని జీవితం, ఆయన ప్రబోధించిన ఉన్నతాదర్శాలు, ప్రపంచోద్ధరణ కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వేడుకలు నిర్వహించే రోజని పేర్కొన్నారు. కోవిడ్-19పై మానవాళి పోరులో ముందువరుసన నిలిచిన యోధులకు నిరుటి వైశాఖీ పూర్ణిమ కార్యక్రమాలను అంకితం చేసినట్లు ఆయన గుర్తుచేశారు. నేడు ఏడాది గడచిన తర్వాత కూడా కోవిడ్-19 మహమ్మారి మనను విడిచిపెట్టలేదని, భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాలను రెండోదశ పట్టి పీడిస్తున్నదని పేర్కొన్నారు. జీవితకాలంలో ఒకసారి దాపురించే ఇలాంటి మహమ్మారి అనేకమంది ముంగిళ్లను కష్టాలు-కన్నీళ్లతో విషాదంలో ముంచెత్తిందని, ప్రతి దేశంలోనూ లెక్కకు మిక్కిలిగా ప్రజలపై ఈ దుష్ప్రభావం పడిందని ఆయన వ్యాఖ్యానించారు. మహమ్మారి సృష్టించిన ఆర్థిక దుష్ప్రభావం భారీస్థాయిలో ఉన్నందున కోవిడ్-19 తర్వాత భూగోళం మునుపటిలా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అయితే, గడచిన ఏడాది కాలంలో గమనించదగిన అనేక ఆశావహ అంశాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు మహమ్మారిపై అవగాహన మెరుగుపడిందని, తద్వారా దానిపై పోరు వ్యూహం నేడు బలోపేతమైందని చెప్పారు. దీంతోపాటు మన చేతిలోగల ప్రధాన ఆయుధమైన టీకాలు నేడు ప్రజలకు ప్రాణరక్షణతోపాటు మహమ్మారిని తరిమికొట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఏడాది వ్యవధిలో కోవిడ్-19కు టీకాల తయారీలో మన శాస్త్రవేత్తలు చేసిన కృషి ప్రశంసనీయమని, మానవాళి దీక్షాదక్షతల శక్తికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
బుద్ధదేవుని జీవితంలో ప్రధానమైన నాలుగు ప్రదేశాలు ప్రపంచ మానవాళి వేదనలను దూరం చేసేదిశగా ఆయనలో ప్రగాఢ వాంఛను రగిలించాయని ప్రధానమంత్రి చెప్పారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో గత సంవత్సరం అనేక సంస్థలు, వ్యక్తులు మానవ వేదనను ఉపశమింప చేయడంలో శక్తివంచన లేకుండా తమవంతు పాత్రను పోషించాయని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగాగల అనేక బౌద్ధ సంస్థలు, బౌద్ధ ధర్మాన్ని అనుసరించే వ్యక్తులు వైద్య పరికరాలు, ఔషధాలు తదితర సరంజాను ఎంతో ఉదారంగా అందజేశాయన్నారు. ఇవన్నీ బుద్ధ భగవానుని ‘‘భవతు సబ్బ మంగళం’’ (మానవాళికి సర్వశుభాలూ కలుగుగాక) అనే ప్రబోధానికి అనుగుణంగా చేపట్టిన చర్యలేనని ఆయన వ్యాఖ్యానించారు.
కోవిడ్-19పై పోరాడుతున్న నేపథ్యంలో మానవాళి ఎదుర్కొంటున్న వాతావరణ మార్పు వంటి ఇతర సవాళ్లను విస్మరించరాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత తరంతోపాటు నిర్లక్ష్యపూరిత జీవనశైలి భవిష్యత్తరాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పర్యవసానంగా భూగోళం తన రూపురేఖలు కోల్పోకుండా రక్షించే దిశగా దృఢ సంకల్పం పూనాలని పిలుపునిచ్చారు. బుద్ధ భగవానుని బోధనలలో ప్రకృతి మాతను గౌరవించడం అత్యంత ప్రధానాంశమని ఆయన గుర్తుచేశారు. ప్యారిస్ లక్ష్యాల సాధనకు చేరువలోగల కొన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ కూడా ఒకటని ఆయన ప్రకటించారు. భారతదేశానికి సంబంధించి సుస్థిర జీవనమంటే సరైన పదజాలం మాత్రమే కాదని, సముచిత చర్యలు కూడా అని ఆయన స్పష్టీకరించారు.
బుద్ధ భగవానుని జీవితం మనకు ‘శాంతి-సామరస్యం-సహజీవన’ సూత్రాలను ప్రధానంగా బోధిస్తున్నదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, నేడు ‘ద్వేషం, ఉగ్రవాదం, విచక్షణరహిత హింస’పై ఆధారపడిన శక్తులు నేటికీ మనుగడ సాగిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. అటువంటి శక్తులకు ఉదార ప్రజాస్వామ్య సూత్రాలపై విశ్వాసం ఉండదని స్పష్టం చేశారు. కాబట్టి మానవత్వాన్ని విశ్వసించేవారంతా ‘ఉగ్రవాదం... తీవ్రవాద భావజాలం‘పై యుద్ధానికి ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు బుద్ధదేవుని బోధనలు, సామాజిక న్యాయానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతర్జాతీయ శక్తిని సంఘటితం చేయగల ఉపకరణాలు కాగలవన్నారు.
బుద్ధ భగవానుని అమూల్య బోధనల ప్రకాశం సకల విశ్వానికీ వెలుగునివ్వగలదని ప్రధానమంత్రి అన్నారు. ఆయన ఆలోచలన నుంచి మనమంతా ఎప్పటికప్పుడు ఉపదేశం పొంది కరుణ, ప్రపంచ సంక్షేమం-బాధ్యతల మార్గంలో పయనించగలమన్నారు. ఈ సందర్భంగా ‘‘మనకు కనిపించేదానికి భిన్నంగా సత్యం-ప్రేమల తుది విజయంపై నమ్మకాన్ని పెంచుకోవడం ఎలాగో బుద్ధభగవానుడు మనకు నేర్పాడు’’ అన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యలను ప్రధాని ఉటంకించారు. తదనుగుణంగా బుద్ధదేవుని ఆదర్శాలకు పునరంకితమవుతూ ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
ఆపన్నులకు నిత్యం సేవలందించడంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి నిస్వార్థ సేవలందిస్తున్న ప్రథమ స్పందనదారులు, ముందువరుస ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, నర్సులు, స్వచ్ఛంద కార్యకర్తలు తదితరులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరోపకార సేవలలో కష్టనష్టాలకు గురైన... ఆప్తులను, సన్నిహితులను కోల్పోయినవారికి ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.