నమస్కారం, ప్రియమైన నా దేశప్రజలారా!
ఈ రోజు నేను వేద పాఠంతో ప్రారంభించాలనుకుంటున్నాను.
कृतम् मे दक्षिणे हस्ते,
जयो मे सव्य आहितः।
దీనిని భారతదేశ సందర్భంలో చూస్తే, ఒకవైపు మన దేశం విధిని నిర్వర్తించిందని, మరోవైపు అది గొప్ప విజయాన్ని సాధించింది. నిన్న అక్టోబర్ 21న భారత్ 1 బిలియన్, అంటే 100 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను కష్టమైన, కానీ అసాధారణ లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయం వెనుక 130 కోట్ల మంది దేశస్థుల కర్తవ్యం ఉంది, కాబట్టి ఈ విజయం భారతదేశ విజయం, ప్రతి దేశస్థుడి విజయం. ఇందుకు దేశప్రజలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా,
100 కోట్ల వ్యాక్సిన్లు కేవలం సంఖ్య కాదు. ఇది దేశ సామర్థ్యానికి ప్రతిబింబం; ఇది చరిత్రలో కొత్త అధ్యాయం. క్లిష్టమైన లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలో మరియు వాటిని ఎలా సాధించాలో తెలిసిన ఆ కొత్త భారతదేశం యొక్క చిత్రం ఇది. తన తీర్మానాల ను నెరవేర్చడానికి తీవ్రంగా కృషి చేస్తున్న కొత్త భారత దేశ చిత్రం ఇది.
మిత్రులారా,
నేడు చాలా మంది భారతదేశ టీకా కార్యక్రమాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుతున్నారు. భారతదేశం వంద బిలియన్ మార్కును దాటిన వేగం కూడా ప్రశంసించబడుతోంది. అయితే, ఈ విశ్లేషణలో ఒక విషయం తరచుగా విస్మరించబడుతోంది, అదే ,మనం ఎక్కడ నుండి ప్రారంభించాము? అభివృద్ధి చెందిన దేశాలు టీకాల పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించి దశాబ్దాల నాటి నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి. భారతదేశం ఎక్కువగా ఈ దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లపై ఆధారపడింది. మనం వాటిని దిగుమతి చేసుకుంటాము మరియు 100 సంవత్సరాలలో అతిపెద్ద మహమ్మారి వచ్చినప్పుడు భారతదేశం గురించి ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రపంచ మహమ్మారితో భారతదేశం పోరాడగలదా? ఇతర దేశాల నుండి ఇన్ని వ్యాక్సిన్‌లను కొనడానికి భారతదేశానికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? భారత్‌కు టీకాలు ఎప్పుడు వస్తాయి? భారత ప్రజలకు టీకాలు వేస్తారా లేదా? మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి భారతదేశం తగినంత మందికి టీకాలు వేయగలదా? రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, కానీ నేడు ఈ 100 కోట్ల సంఖ్య అటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. భారతదేశం తన పౌరులకు 100 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చింది, అది కూడా ఉచితంగా.
మిత్రులారా,
100 కోట్ల వ్యాక్సినేషన్ల ప్రభావాలలో ఒకటి, ప్రపంచం ఇప్పుడు కరోనా కంటే భారతదేశాన్ని సురక్షితంగా పరిగణిస్తుంది. ఫార్మా హబ్ గా భారతదేశ గుర్తింపు మరింత బలోపేతం అవుతుంది. ప్రపంచం మొత్తం నేడు భారతదేశ బలాన్ని చూస్తోంది.
మిత్రులారా,
'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, మరియు సబ్ కా ప్రయాస్'లకు భారతదేశ వ్యాక్సినేషన్ ప్రచారం సజీవ ఉదాహరణ. కరోనా మహమ్మారి ప్రారంభ దశలలో, భారతదేశం వంటి ప్రజాస్వామ్యంలో ఈ మహమ్మారిపై పోరాడటం చాలా కష్టమని భయాలు కూడా వ్యక్తం చేయబడుతున్నాయి. దీనికి అవసరమైన సంయమనం మరియు క్రమశిక్షణకు సంబంధించి భారతదేశం, భారత ప్రజల కోసం కూడా ఇది చెప్పబడుతోంది? కానీ మాకు ప్రజాస్వామ్యం అంటే 'సబ్ కా సాథ్ (ప్రతి ఒక్కరి సహకారం). ప్రతి ఒక్కరినీ వెంట తీసుకువెళ్తూ, దేశం 'అందరికీ వ్యాక్సిన్', 'ఉచిత వ్యాక్సిన్' ప్రచారాన్ని ప్రారంభించింది. పేదవారైనా, ధనవంతులైనా, గ్రామమైనా, నగరమైనా, సుదూర ప్రాంతాలలో, ఈ వ్యాధి వివక్ష చూపకపోతే, అప్పుడు వ్యాక్సినేషన్ లో ఎలాంటి వివక్ష ఉండదని దేశానికి ఒకే ఒక మంత్రం ఉంది. అందువల్ల, విఐపి సంస్కృతి వ్యాక్సినేషన్ ప్రచారంలో ఆధిపత్యం వహించకుండా చూసుకున్నారు. ఎవరైనా ఎంత ముఖ్యమైన పదవిని కలిగి ఉన్నా, అతను ఎంత ధనవంతుడైనప్పటికీ, అతను సాధారణ పౌరుల మాదిరిగానే వ్యాక్సిన్లను పొందుతాడు.
మిత్రులారా,
చాలా మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకోడానికి రారని కూడా మన దేశానికి చెప్పబడింది. ప్రపంచంలోని అనేక ప్రధాన అభివృద్ధి చెందిన దేశాలలో వ్యాక్సిన్ సంకోచం నేటికీ ఒక ప్రధాన సవాలుగా ఉంది. కానీ భారత ప్రజలు అటువంటి విమర్శకులకు 100 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను తీసుకోవడం ద్వారా సమాధానం ఇచ్చారు.
మిత్రులారా,
'సబ్ కా ప్రయాస్' (ప్రతి ఒక్కరి ప్రయత్నం) ఒక ప్రచారానికి జోడించినప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేసిన పోరాటంలో మా మొదటి శక్తిగా మేము ప్రజల భాగస్వామ్యాన్ని చేసాము, వారిని రక్షణ మొదటి పంక్తిగా చేసాము. దేశం చప్పట్లు కొట్టింది, థాలీలను కొట్టింది మరియు దాని సంఘీభావానికి శక్తిని ఇవ్వడానికి దీపాలు వెలిగించింది. అప్పుడు కొంతమంది ఈ వ్యాధి ఈ పనులన్నీ చేయడం ద్వారా పారిపోతుందా? అని కొందరు ప్రశ్నించారు. కానీ మనమందరం దానిలో దేశం ఐక్యతను, సమిష్టి శక్తిని మేల్కొల్పడం చూశాము. ఈ సమిష్టి శక్తి దేశాన్ని ఇంత తక్కువ సమయంలో 100 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల మైలురాయికి తీసుకువెళ్ళింది. చాలాసార్లు మన దేశం ఒక రోజులో కోటి వ్యాక్సినేషన్ మార్కును దాటింది. ఇది భారీ సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యం మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్తమంగా ఉపయోగించడం, ఇది ప్రధాన దేశాలకు కూడా లేదు.
మిత్రులారా,
భారతదేశం యొక్క మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమం సైన్స్ గర్భంలో జన్మించింది, శాస్త్రీయ ప్రాతిపదికన వర్ధిల్లింది, మరియు శాస్త్రీయ మార్గాల్లో అన్ని దిశలకు చేరుకుంది. భారతదేశం యొక్క మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమం, సైన్స్ బోర్న్, సైన్స్ డ్రైవెన్ మరియు సైన్స్ బేస్డ్ మనందరికీ గర్వకారణం. వ్యాక్సిన్‌ల అభివృద్ధి నుండి టీకాలు వేసే వరకు ప్రతిచోటా మొత్తం ప్రచారంలో సైన్స్ మరియు శాస్త్రీయ విధానం ఉంది. మా ముందున్న సవాలు తయారీతో పాటు ఉత్పత్తిని పెంచడం. ఇంత పెద్ద దేశం మరియు ఇంత భారీ జనాభా! ఆ తర్వాత, టీకాలు వివిధ రాష్ట్రాలలో మరియు సుదూర ప్రాంతాలలో సమయానికి పంపిణీ చేయడానికి! ఇది కూడా ఒక పెద్ద పని కంటే తక్కువ కాదు. కానీ, దేశం ఈ సవాళ్లకు శాస్త్రీయ పద్ధతులు మరియు కొత్త ఆవిష్కరణలతో పరిష్కారాలను కనుగొంది. వనరులను అసాధారణ వేగంతో పెంచారు. ఏ రాష్ట్రం ఎన్ని టీకాలు వేయాలి, ఎప్పుడు, ఏ ప్రాంతానికి ఎన్ని వ్యాక్సిన్లు చేరాలి తదితర శాస్త్రీయ సూత్రాన్ని ఉపయోగించారు. మన దేశం నిర్మించిన కోవిన్ ప్లాట్ ఫామ్ వ్యవస్థ ఇది యావత్ ప్రపంచానికి ఆకర్షణ కేంద్రంగా మారింది. భారతదేశంలో నిర్మించిన కోవిన్ వేదిక సామాన్యులకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా, మా వైద్య సిబ్బంది పనిని సులభతరం చేసింది.
మిత్రులారా,
ఈ రోజు చుట్టూ నమ్మకం, విశ్వాసం మరియు ఉత్సాహం ఉన్నాయి. సమాజం నుండి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రతి విభాగంలోనూ ఆశావాదం ఉంది. స్వదేశంలో మరియు విదేశాలలో నిపుణులు మరియు అనేక ఏజెన్సీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చాలా సానుకూలంగా ఉన్నాయి. నేడు, భారతీయ కంపెనీలు రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడుతున్నాయి. రికార్డు స్థాయిలో పెట్టుబడులతో స్టార్టప్‌లు యూనికార్న్‌గా మారుతున్నాయి. గృహనిర్మాణ రంగంలో కూడా కొత్త శక్తి కనిపిస్తోంది. గత కొన్ని నెలల్లో చేపట్టిన వివిధ సంస్కరణలు మరియు కార్యక్రమాలు -- గతిశక్తి నుండి కొత్త డ్రోన్ విధానం వరకు - భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కరోనా కాలంలో వ్యవసాయ రంగం మన ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచింది. నేడు ప్రభుత్వ ఆహార ధాన్యాల సేకరణ రికార్డు స్థాయిలో జరగడంతోపాటు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరుతున్నాయి. వ్యాక్సిన్ ల కవరేజీ పెరగడంతోపాటు, ఆర్థిక-సామాజిక కార్యకలాపాలు, క్రీడలు, పర్యాటకం లేదా వినోదం అయినా సానుకూల కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. రాబోయే పండుగ సీజన్ దీనికి మరింత వేగాన్ని మరియు బలాన్ని ఇస్తుంది.
మిత్రులారా,
ఒకప్పుడు ఇటు ఆ దేశానికి 'మేడ్ ఇన్' అంటే క్రేజ్ ఉండేది. కానీ ఈ రోజు ప్రతి దేశవాసి ‘మేడ్ ఇన్ ఇండియా’ శక్తి చాలా పెద్దదని గ్రహిస్తున్నారు. అందువల్ల, భారతదేశంలో తయారు చేయబడిన ప్రతి చిన్న వస్తువును కొనాలని పట్టుబట్టాలని నేను మిమ్మల్ని మళ్లీ కోరుతున్నాను మరియు దాని తయారీ వెనుక భారతీయుడి చెమట ఉంది. ఇది అందరి కృషితోనే సాధ్యమవుతుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ ఒక ప్రజా ఉద్యమం కాబట్టి, అదేవిధంగా, మనం మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయాలి మరియు స్థానికుల స్వరం అవ్వాలి. దీన్ని మనం ఆచరణలో పెట్టాలి. మరియు, ప్రతి ఒక్కరి ప్రయత్నాలతో మేము దీన్ని చేయగలమని నేను నమ్ముతున్నాను. గత దీపావళి సందర్భంగా అందరి మనసుల్లో ఏదో ఒక టెన్షన్ నెలకొని ఉందని మీకు గుర్తుంది. అయితే ఈ దీపావళికి 100 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు రావడంతో ఆత్మవిశ్వాసం నెలకొంది. నా దేశపు వ్యాక్సిన్‌లు నాకు రక్షణను అందించగలిగితే, నా దేశ ఉత్పత్తులు నా దీపావళిని ఘనంగా నిర్వహించగలవు. దీపావళి అమ్మకాలు భిన్నంగా ఉన్నాయి. దీపావళి, పండుగల సీజన్‌లో విక్రయాలు జోరందుకున్నాయి. 100 కోట్ల వ్యాక్సిన్ డోస్‌ల సంఖ్య మన చిన్న దుకాణదారులు, వ్యాపారవేత్తలు మరియు వీధి వ్యాపారులతో సహా అందరికీ ఆశాకిరణంగా వచ్చింది.
మిత్రులారా,
నేడు అమృత్ మహోత్సవ్ తీర్మానాలు మన ముందు ఉన్నాయి మరియు ఈ విజయం మనకు కొత్త విశ్వాసాన్ని ఇస్తుంది. పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు వాటిని సాధించడం కూడా దేశానికి బాగా తెలుసు అని మనం ఈ రోజు చెప్పగలం. అయితే మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. కవచం ఎంత మంచిదైనా, ఎంత ఆధునిక కవచమైనా, కవచం పూర్తి రక్షణ హామీ ఇచ్చినా, యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయుధాలను వదులుకోరు. మన పండుగలను అత్యంత జాగ్రత్తగా జరుపుకోవాలని నా విన్నపం. ఇక మాస్క్ విషయానికొస్తే, ఇప్పుడు డిజైనర్ మాస్క్‌లు కూడా ఉన్నాయి కాబట్టి, మనం బయటికి వెళ్లేటప్పుడు బూట్లు ధరించే విధంగానే మాస్క్‌లను ధరించాలి. టీకాలు వేయించుకోని వారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. టీకాలు వేయించుకున్న వారు ఇతరులకు స్ఫూర్తినివ్వాలి. మనమందరం కలిసి ప్రయత్నిస్తే, త్వరలో కరోనాను ఓడించగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రాబోయే పండుగలకు మీ అందరికీ శుభాకాంక్షలు,చాలా ధన్యవాదాలు!