ప్రవాస భారతీయ దినోత్సవం (పీబీడీ) కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇది విదేశాల్లోని భారతీయులతో మమేకం కావడానికి, పరస్పర సంభాషణలకూ ఉద్దేశించిన ఒక ముఖ్యమైన వేదిక. ఈ నేపథ్యంలో 17వ ప్రవాస భారతీయ దినోత్సవ సదస్సును కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి 8 నుంచి 10వ తేదీదాకా ఇండోర్ నగరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహించనుంది. ఈసారి “ప్రవాసులు: అమృతకాలంలో భారత ప్రగతికి విశ్వసనీయ భాగస్వాములు” ఇతివృత్తంగా ‘పీబీడీ’ నిర్వహించబడుతోంది. ఇందులో పాల్గొనేందుకు దాదాపు 70 దేశాల నుంచి 3,500 మంది ప్రవాస భారతీయులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
ఈ ఏడాది ‘పీబీడీ’ని మూడు విభాగాలుగా నిర్వహిస్తున్నారు: ఈ మేరకు 2023 జనవరి 8న ‘యువ ప్రవాస భారతీయ దినోత్సవం’ ప్రారంభమవుతుంది. ఇది కేంద్ర క్రీడా-యువజన మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో నిర్వహించబడుతుంది. ఇందులో ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యురాలు గౌరవనీయ జానెటా మస్కరెన్హాస్ గౌరవ అతిథిగా పాల్గొంటారు.
అనంతరం గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జనవరి 9న ‘పీబీడీ’ సదస్సును ప్రారంభిస్తారు. గయానా సహకార గణతంత్ర సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ మొహమద్ ఇర్ఫాన్ అలీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తారు. అలాగే సురినామ్ గణతంత్ర సమాఖ్య అధ్యక్షులు గౌరవనీయ చంద్రికాపెర్సాద్ సంతోఖీ ప్రత్యేక గౌరవ అతిథిగా పాల్గొంటారు.
ఈ సందర్భంగా సురక్షిత, చట్టబద్ధ, క్రమబద్ధ, నైపుణ్యంతో కూడిన వలసకుగల ప్రాధాన్యాన్ని చాటుతూ “సురక్షితంగా వెళ్లండి.. సుశిక్షితులై వెళ్లండి” నినాదంతో ప్రత్యేక స్మారక తపాలా బిళ్ల ఆవిష్కరించబడుతుంది. అలాగే “స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు-భారత స్వాతంత్ర్య సమరంలో ప్రవాసుల పాత్ర” ఇతివృత్తంగా ప్రవాస భారత స్వాతంత్ర్య యోధుల కృషిని వివరించే తొలి డిజిటల్ ‘పీబీడీ’ ప్రదర్శనను గౌరవనీయ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే జి-20కి భారత అధ్యక్షత నేపథ్యంలో జనవరి 9న ప్రత్యేక పురమందిర సమావేశం కూడా నిర్వహించబడుతుంది.
ఇక 2023 జనవరి 10న గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ‘ప్రవాస భారతీయ పురస్కారం-2023’ ప్రదానం చేయడంతోపాటు ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.
ప్రవాస భారతీయులు సాధించిన విజయాలకు గుర్తింపుతోపాటు, ఆయా దేశాల్లోని వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారిని గౌరవిస్తూ ప్రభుత్వం ‘ప్రవాస భారతీయ పురస్కారాన్ని’ ఏటా అందజేస్తుంది.
ఈసారి ‘పీబీడీ’లో ఐదు ఇతివృత్తాలపై సదస్సులు నిర్వహిస్తారు:-
- మొదటిది - ‘ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలలో ప్రవాస భారత యువత పాత్ర’పై నిర్వహించనుండగా, కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ దీనికి అధ్యక్షత వహిస్తారు.
- రెండోది – ‘అమృత కాలంలో భారతీయ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థకు ప్రోత్సాహంలో ప్రవాస భారతీయుల పాత్ర - విజన్@2047’పై నిర్వహిస్తారు. దీనికి ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించనుండగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ సహాధ్యక్షులుగా ఉంటారు.
- మూడోది – ‘భారత మృదు శక్తి సద్వినియోగం – చేతివృత్తులు, వంటకాలు-సృజనాత్మకత ద్వారా సద్భావన’పై నిర్వహిస్తుండగా, దీనికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి అధ్యక్షత వహిస్తారు.
- నాలుగోది – ‘భారత శ్రామిక శక్తి ప్రపంచ చలనశీలతకు ప్రోత్సాహం – ప్రవాస భారతీయుల పాత్ర’పై నిర్వహిస్తుండగా, దీనికి విద్య-నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపకత శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహిస్తారు.
- ఐదోది – ‘దేశ ప్రగతికి సమగ్ర విధానం దిశగా ప్రవాస పారిశ్రామికవేత్తల సామర్థ్య వినియోగం’పై నిర్వహిస్తుండగా, దీనికి ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు.
ఈ ఐదు సదస్సులకూ ప్రముఖ ప్రవాస భారత నిపుణులను ఆహ్వానించి చర్చా గోష్ఠులు నిర్వహిస్తారు. ఈసారి 17వ ‘పీబీడీ’ని నాలుగేళ్ల తర్వాత, కోవిడ్-19 మహమ్మారి అనంతరం ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. కాగా, 2021లో ‘పీబీడీ’ని మహమ్మారి పరిస్థితుల కారణంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు.