ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ తో ఫోన్ లో సుహృద్భావ, ఉత్పాదక సంభాషణ జరిపారు.
భారత, అమెరికా మధ్య నెలకొన్న సమగ్ర ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం కారణంగా విభిన్న రంగాల్లో మంచి వృద్ధి ఏర్పడడం పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు బైడెన్ సంతృప్తి ప్రకటించారు. ఎయిరిండియా, బోయింగ్ మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందాన్ని వారు ఆహ్వానించారు. పరస్పర లాభదాయకమైన భాగస్వామ్యానికి ఇది చక్కని ఉదాహరణ అని వారు ప్రశంసించారు. దీని వల్ల ఉభయ దేశాల్లోనూ ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి. భారత పౌర విమానయాన రంగంలో పెరుగుతున్న అవకాశాలు ఉపయోగించుకునేందుకు ముందుకు రావాలని బోయింగ్, ఇతర అమెరికా కంపెనీలను ప్రధానమంత్రి ఆహ్వానించారు.
ఇటీవల వాషింగ్టన్ డిసిలో జరిగిన ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసెట్) తొలి సమావేశాన్ని ఉభయ నేతలు ఆహ్వానించారు. అంతరిక్షం, సెమీ-కండక్టర్లు, రక్షణ, సరఫరా వ్యవస్థలు, రక్షణ ఉత్పత్తుల ఉమ్మడి ఉత్పత్తి, అభివృద్ధి, మేథో రంగం, ఇన్నోవేషన్, ఇతర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం శక్తివంతం చేసుకోవాలన్న ఆకాంక్ష వారు ప్రకటించారు. ఉభయ దేశాల మధ్య పరస్పర లాభదాయకమైన ప్రజా సంబంధాలను మరింత ఉత్తేజితం చేయాలని వారు అంగీకారానికి వచ్చారు.