దేశవ్యాప్తంగా కోవిడ్ రోగుల చికిత్సలో వినియోగం కోసం రూ.322.5 కోట్లతో 1,50,000 ఆక్సీకేర్ వ్యవస్థల కొనుగోలుకు ‘పీఎం కేర్స్ నిధి’ అనుమతి మంజూరు చేసింది. రోగుల ‘ఎస్పీఓ2’ విలువల స్థాయిని పసిగట్టి తదనుగుణంగా ఆక్సిజన్ ప్రవాహాన్ని నియంత్రించగల ఈ సమగ్ర వ్యవస్థలను డీఆర్డీవో రూపొందించింది. రెండు రూపాల్లో తయారుచేసిన ఈ వ్యవస్థలలో ఒకటి ప్రాథమిక రకం కాగా, ఇందులో ఒక ‘‘10 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్, ఒత్తిడి/ప్రవాహ నియంత్రకం, తేమ నిర్వహణ సదుపాయం, నాసికా గొట్టాలు’’ భాగంగా ఉంటాయి. ఈ వ్యవస్థద్వారా ‘ఎస్పీఓ2’ కొలమానం ఆధారంగా మానవ ప్రమేయంతో ఆక్సిజన్ ప్రవాహం నియంత్రించబడుతుంది. ఇక సూక్ష్మ కృత్రిమ మేధగల రెండోరకం వ్యవస్థలో ఆక్సిజన్ ప్రవాహాన్ని స్వయంచలితంగా నియంత్రించే అల్ప పీడన నియంత్రకం, ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థ, ప్రాథమిక రకానికి అదనంగా లోనికి చొప్పించే ఒక ‘ఎస్పీఓ2’ ఉపకరణం ఉంటాయి.
‘ఎఎస్పీఓ2’ ఆధారిత ఆక్సిజన్ నియంత్రణ వ్యవస్థ రోగి ‘ఎస్పీఓ2’ స్థాయినిబట్టి ఆక్సిజన్ వినియోగాన్ని సానుకూలపరుస్తుంది. తద్వారా చేతిలో చిన్న ఆక్సిజన్ సిలిండర్ మన్నిక సమయాన్ని సమర్థంగా పెంచుతుంది. ఈ వ్యవస్థ నుంచి ఆక్సిజన్ ప్రవాహ ప్రారంభానికి వీలుగా ప్రవేశ ‘ఎస్పీఓ2’ విలువను ఆరోగ్య సిబ్బంది సర్దుబాటు చేయవచ్చు. అటుపైన ఈ వ్యవస్థ ‘ఎస్పీఓ2’ స్థాయులను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు ప్రదర్శిస్తూంటుంది. ఆక్సీకేర్ వ్యవస్థతో ఆక్సిజన్ ప్రవాహంపై నిత్య పర్యవేక్షణ-సర్దుబాటు అవసరంసహా ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై పనిభారం తగ్గుతుంది. దీంతోపాటు వారికి మహమ్మారి ముప్పునుంచి రక్షణ లభించడమే కాకుండా ఇతర రోగులకు దూరవాణి-సంప్రదింపులద్వారా సలహాలిచ్చే వీలు కల్పిస్తుంది.
ఈ స్వయంచాలక వ్యవస్థ ‘ఎస్పీఓ2’ విలువలుసహా, చొప్పించే ఉపకరణం ఊడిపోవడం వంటి వివిధ వైఫల్య నేపథ్యాల్లో తగు విధమైన హెచ్చరికను వినిపిస్తుంది. ఈ ఆక్సీకేర్ వ్యవస్థలను ఇళ్లలో, నిర్బంధ చికిత్స కేంద్రాల్లో, కోవిడ్ సంరక్షణ కేంద్రాలతోపాటు ఆస్పత్రుల్లోనూ ఉపయోగించవచ్చు.
దీనికి అదనంగా ఆక్సీకేర్ వ్యవస్థలలో పునఃశ్వాస నిరోధక మాస్కులను భాగం చేయడం వల్ల ఆక్సిజన్ సముచిత వినియోగంతోపాటు ప్రాణవాయువు 30 నుంచి 40 శాతందాకా ఆదా అవుతుంది.
ఈ వ్యవస్థల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్డీవో భారత్‌లోని వివిధ పరిశ్రమలకు బదిలీ చేసింది. తదనుగుణంగా దేశవ్యాప్త వినియోగం కోసం ఆక్సీకేర్ వ్యవస్థలను ఆయా పరిశ్రమలు ఉత్పత్తి చేయనున్నాయి.
ప్రస్తుత వైద్య విధివిధానాలు తీవ్ర, విషమ స్థితిలోగల కోవిడ్-19 రోగులందరికీ ఆక్సిజన్ చికిత్సను సిఫారసు చేస్తున్నాయి. అయితే, ఆక్సిజన్ ఉత్పత్తితోపాటు రవాణా-నిల్వ పరిస్థితి రీత్యా సిలిండర్ల వినియోగం ప్రభావవంతంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. నేటి కోవిడ్ మహమ్మారి పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నపుడు పెద్ద సంఖ్యలో వ్యక్తులకు ఆక్సిజన్ చికిత్స అవసరమవుతోంది. కాబట్టి ఒకే తరహా వ్యవస్థ వనరును చూపడం ఆచరణాత్మకం కాబోదు. ఈ వ్యవస్థకు సంబంధించిన తయారీ యంత్రాగారాలన్నీ ప్రాథమిక నిర్మాణ భాగాలను మాత్రమే తయారుచేస్తూ, ఇప్పటికే గరిష్ఠ సామర్థ్యంతో పనిచేస్తుండటమే ఇందుకు కారణం. అందువల్ల ఈ పరిస్థితులలో సమ్మిశ్రిత, సరిపోలగల వ్యవస్థను రూపొందించడం ప్రయోజనకరం కాగల అవకాశముంది. కార్బన్-మాంగనీస్ స్టీల్ సిలిండర్ల దేశీయ తయారీదారుల సామర్థ్యం పరిమితం. కాబట్టి ప్రత్యామ్నాయంగా తేలికపాటి ముడిపదార్థంతో ఎక్కడికైనా తరలించగల చిన్న సిలిండర్ల తయారీకి డీఆర్డీవో ప్రతిపాదించింది. సాధారణ సిలిండర్ల స్థానంలో వీటిని చాలా సులభంగా తరలించే వీలుతోపాటు వినియోగ సౌలభ్యం కూడా ఉంటుంది.